
- బీఆర్ఎస్ ఓట్లతో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకి పడ్డయ్ : విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు సాగుతామన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లోకి నెట్టి వెళ్లిపోయిందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ అవసరమని..
రాష్ట్రానికి అవసరమైన నిధులను తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా గెలవలేదని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికలలో దేశంతో పాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచిందని.. అందుకే తమకు అత్యధిక మెజార్టీ వచ్చిందని పేర్కొన్నారు. పోలీసులు ఎన్నికల సమయంలో బాగా పని చేశారని కితాబునిచ్చారు. అందుకే ఎన్నికలు నిజాయతీగా జరిగాయన్నారు.
మద్యం, డబ్బుల పంపిణీ ప్రభావం ఈ ఎన్నికల్లో అంతగా పనిచేయలేదన్నారు. ఇదే ఊపుతో సర్పంచ్, స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పని చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ ఓట్లు డైవర్ట్ అయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ ఓట్లే కాదు కాంగ్రెస్ ఓట్లు కూడా తమకు పడ్డాయని అందులో భాగంగానే ఎక్కువ మెజార్టీ వచ్చిందని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు