హిందీ సినిమాలకి ఊపిరి పోసిన "ఛావా"... మొత్తానికి పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేసిందిగా..

హిందీ సినిమాలకి ఊపిరి పోసిన "ఛావా"... మొత్తానికి  పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేసిందిగా..

బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన 'ఛావా' బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు కావస్తున్నప్పటికీ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకి బాలీవుడ్  ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో వారంతో సంబంధం లేకుండా డైలీ రూ.20 నుంచి రూ.30 కోట్లు కలెక్ట్ చేస్తూ దర్శక నిర్మాతలకి లాభాల పంట పండిస్తోంది.

అయితే మూడవ శనివారం, ఈ చిత్రం రూ. 22.50 కోట్ల నికర వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకూ బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలలో 3వ శనివారం అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో 'ఛావా' టాప్ లో నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 (రూ. 20.50 కోట్లు) మరియు స్త్రీ 2 (రూ. 17.40 కోట్లు) మూడవ శనివారం వసూళ్లను అధిగమించింది. ఇప్పటివరకూ  రూ.447 కోట్ల నికర వసూళ్లు నమోదయ్యాయి. దీంతో ఈ చిత్రం చాలా ఫాస్ట్ గా రూ. 500 కోట్ల మైలురాయి వైపు దూసుకుపోతోంది. త్వరలోనే బాలీవుడ్ చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే బాలీవుడ్ లో ఈ సినిమా రెస్పాన్స్ చూసి తెలుగు ఆడియన్స్ కూడా "ఛావా" సినిమా ని టాలీవుడ్ లో రిలీజ్ చెయ్యాలని కోరుతున్నారు. దీంతో డబ్బింగ్ రైట్స్ ని తెలుగు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ దక్కించుకుని రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగా మార్చ్ 07న థియేటర్స్ లోకి రానుంది. అయితే కేవలం బాలీవుడ్ లో మాత్రమే ఇప్పటివరకూ దాదాపుగా రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి కూడా అదే రేంజ్ లో కనెక్ట్ అయితే మాత్రం ఈజీగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.