బాలికపై గ్యాంగ్​ రేప్​ కేసులో నిందితుల అరెస్ట్..

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
పోలీసుల అదుపులో ఆరుగురు మైనర్లు
కేసు దర్యాప్తు చేస్తున్న ఛత్రినాక పోలీసులు

హైదరాబాద్ : పాతబస్తీలో సంచలనం సృష్టించిన బాలిక గ్యాంప్​రేప్​కేసులో ఆరుగురు నిందితులను ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. బాధితురాలని బలవంతంగా బర్త్ డే పార్టీకి తీసుకెళ్లిన మరో బాలికను కూడా పోలీసులు అరెస్ట్ చేసి, జువైనల్ హోమ్ కు తరలించారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఈనెల 4వ తేదీన మందుల కోసం ఓ మెడికల్ హాల్ కు వెళ్లింది. అక్కడ ఆమెకు తన స్నేహితురాలు కలిసింది. బర్త్ డే పార్టీ ఉందని చెప్పి బలవంతంగా తన వెంట బాధితురాలని తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ తన బాయ్​ ఫ్రెండ్​ రాజ్​ కుమార్ అలియాస్​ టుంబు(18)తో పాటు కె.రాహుల్(21), నితిన్ అలియాస్ చింటు(19), దీక్షిత్ అలియాస్​ కాట్లు(19), మల్లేష్(18), సామ పవన్ అలియాస్​సాకల్ పవన్(18) ఉన్నారు. 

రాజ్​కుమార్​తన గర్ల్​ ఫ్రెండ్​ను పక్కకు తీసుకుని వెళ్లగా.. వెంట వచ్చిన బాలిక అక్కడే ఉంది. ఈ క్రమంలోనే రాజ్ కుమార్ స్నేహితులు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించారు. మద్యం కలిపిన కూల్​డ్రింక్​ను ఆ బాలికతో తాగించడంతో ఆమె  స్పృహ కోల్పోయింది. ఉదయం లేచి చూసేసరికి అర్థనగ్నంగా ఉండడంతో కంగారుపడింది. తనపై అత్యాచారం జరిగినట్లు గ్రహించిన బాలిక.. జరిగిన విషయాన్ని ఇంటికి వచ్చి తన తల్లితో చెప్పింది. తల్లి సహకారంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసును నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు ఆరుగురు యువకులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. బాధితురాలిని తన వెంట బలవంతంగా తీసుకెళ్లిన మరో బాలికను అదుపులోకి తీసుకున్నారు.