ఛత్రపతి శివాజీ తరగని స్ఫూర్తి : పగుడాకుల బాలస్వామి

తరాలు మారినా క్రేజీ తగ్గని పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ పేరు విన్నా.. రూపం చూసినా, ప్రతి హిందువుకూ తన కర్తవ్యం గుర్తొస్తుంది. హైందవ జాతికి తాను చేసిన సేవ, త్యాగం, తన కుమారుడు శంభాజీ బలిదానం వింటే ప్రతి ఒక్కరిలో ప్రేరణ కలిగి, స్ఫూర్తి రగులుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి పల్లెలో ఛత్రపతి శివాజీ జయంతి జరపడం   శివాజీ పై హిందూ సమాజం చూపుతున్న ఆదరణకు ప్రతీక. భాగ్యనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పల్లె పల్లెలో ఫిబ్రవరి19వ తేదీన ఓ పండుగ వాతావరణం నెలకొంటుంది. అఖండ భారతావనిని మొత్తం ఎవరికి వారు వందల కొద్దీ సంస్థానాలుగా పాలన సాగిస్తున్న సందర్భంలో పరాయి దేశస్తుల కుట్రలు హిందూ దేశాన్ని విచ్ఛిన్నం చేయసాగాయి.  దాడులు, అత్యాచారాలు, హత్యలు, లూటీలు, దోపిడీలు, మత, రాజ్య హింస, గోహత్యలతో ముష్కర పాలన అంతులేకుండా సాగుతున్నది.   బొట్టు పెట్టినా, జుట్టు పెంచినా పన్ను చెల్లించాలి. పూజలు చేసినా శిస్తు కట్టాల్సిందే. హిందువుల ఆచార వ్యవహారాలపై లెక్కలేనన్ని ఆంక్షలు ఉండేవి. అలాంటి సందర్భంలో మొగలుల రాజు దగ్గర ఓ సైనికుడిగా పనిచేస్తున్న కుటుంబంలో (19 ఫిబ్రవరి,1630) షాహాజీ బోంస్లే, జిజియాబాయి దంపతులకు జన్మించాడు ఛత్రపతి శివాజీ మహారాజు.

తల్లి లక్ష్యం నెరవేర్చగా...

శివాజీ తల్లి జిజియాబాయి ఆయనకు ఉగ్గు పాలు, గోరుముద్దలతో పాటు విద్యాబుద్ధులు, నీతి నియమాలు యుద్ధ తంత్రాలు కూడా నేర్పింది. ధర్మ రక్షణకు కృషి చేయాలని, అధర్మాన్ని అంతం చేయాలనే సంకల్పం అణువణువునా నూరిపోసింది. ఇల్లే పాఠశాలగా, తల్లే గురువుగా శివాజీ రాజధర్మం నేర్చుకున్నాడు. సహజంగా పొట్టివాడైన ఆయన.. ధైర్య సాహసాలు తెలివితేటల్లో మాత్రం గట్టివాడు. విపత్కర సందర్భాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించేవాడు.తల్లి ఆశయాలకు అనుగుణంగా, హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా అడుగులు వేశాడు ఛత్రపతి.‘‘అదిగో ఛత్రపతి.. ధ్వజమెత్తిన ప్రజాపతి...భరతమాత నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు’’ అంటూ రక్తం మరిగించే మన తెలుగు పాట శివాజీ పౌరుషానికి ప్రతీక.

గురువుకు రాజ్యం ధారాదత్తం

తల్లిదండ్రులు, గురువులు కనిపించే దైవం అని, వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని శివాజీ భావించేవారు. ఓసారి చత్రపతి గురువైన సమర్థ రామదాసు తన శిష్యుడిని పరీక్షించాలని శివాజీ రాజ్యానికి మారువేషంలో వచ్చి భిక్షాందేహి అంటాడు. అయితే దానం చేయడానికి స్వయంగా మహారాజే రావాలని ఆదేశిస్తాడు. దీంతో ఛత్రపతి వస్తాడు. మారువేషంలో ఉన్న గురువును పసిగట్టి సాష్టాంగ నమస్కారం చేసి.. "గురూజీ ఈ దేహంతో పాటు రాజ్యం కూడా నీదే" అంటూ రాజ్యాన్ని మొత్తం రాసి గురు దక్షిణగా సమర్థ రామదాసు జోలెలో వేస్తాడు. శిష్యుడి గురు భక్తిని మెచ్చుకొని సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలించాలని ఆశీర్వదించి వెళ్లిపోతాడు.

నానాటికీ పెరుగుతున్న ఖ్యాతి

హిందూ సమాజంపై ఎక్కడ దాడి జరిగినా నేనున్నానంటూ అభయం కల్పించిన వీరుడు శివాజీ. ఛత్రపతి శివాజీ వేసిన ప్రతి అడుగు హైందవ సమాజ ఔన్నత్యానికే అనేది సత్యం. వెన్ను చూపని ఆయన పోరాటంలో కుటుంబాన్ని కోల్పోయాడు. నలుగురు భార్యలతో పాటు కుమారుడు శంభాజీ కూడా తనువు చాలించాడు. శివాజీ మరణానంతరం మతం మారాలని శివాజీ కొడుకు శంబాజీని తలకిందులుగా వేలాడదీసి గోళ్లు నరికి చర్మం వలిచినా హిందూ మతాన్ని ఆయన వీడలేదు. అందుకే వారి త్యాగాలు హిందూ సమాజానికి సదా ఆదర్శం. 

పరమత సహనం

తన రాజ్యంలో అన్ని మతాలకు స్థానం కల్పించి అందరి విశ్వాసాలు గౌరవించేవారు శివాజీ మహారాజు. కానీ మొగలాయిల రాజ్యంలో ఎటు చూసినా హైందవ ఆడ జాతిపై సాగుతున్న రాక్షసత్వానికి బదులు తీసుకోవాలని ఆలోచన ఏరోజూ ఆయన మదిలో ఉండేది కాదు. కొంతమంది తన సైనికులు ముస్లిం యువతిని తీసుకువచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు.  వారిని తీవ్రంగా మందలించి పరాయి మహిళ ఏ మతస్తురాలైనా తల్లితో సమానమని బోధిస్తాడు. ఏ రోజూ కూడా ఇతర మతస్తులపై ఆధిపత్యం, కక్ష సాధింపులు చేయని సమధర్మ వాది ఛత్రపతి.

హైందవ జాతిని జాగృతం చేసి..

హిందూ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలను కాలరాసి క్రూరంగా మతమార్పిడులకు పాల్పడుతున్న మొగల్ రాజుల మెడలు వంచిన వీరుడు శివాజీ. కంటికి కన్ను పంటికి పన్ను అనే రీతిలో శత్రువులకు బుద్ధి చెప్పి హైందవ సమాజాన్ని రక్షించుకున్న ధీరుడు ఆయన. చుట్టూ విస్తరించి ఉన్న మొగలులను ఎదిరించే క్రమంలో చతురత ప్రదర్శించాడు. సైన్యం తక్కువగా ఉండటంతో గెరిల్లా యుద్ధం చేసి శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించాడు. విజయమో వీర స్వర్గమో అంటూ తన సైన్యంలోని ప్రతి ఒక్కరిని మానసికంగా సంసిద్ధులను చేసి.. ధర్మరక్షణలో వెన్నుచూపని వీరులుగా తీర్చిదిద్దాడు. అరచేతిలో ప్రాణాలను పట్టుకొని జీవిస్తున్న హైందవ జాతిని కంటికి రెప్పలా కాపాడాడు. రాజ తంత్రం ఉపయోగించి శత్రువుల కంటిమీద కునుకు లేకుండా చేశాడు. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి హైందవ జాతిని జాగృతం చేశాడు.

- పగుడాకుల బాలస్వామి, ప్రచార ప్రముఖ్, వీహెచ్​పీ తెలంగాణ