మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్.. 18 మంది నక్సల్స్ మృతి

మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్.. 18 మంది నక్సల్స్ మృతి

బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో ఉన్న అండ్రి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఎన్ కౌంటర్లో 18 మంది నక్సలైట్లు మృతి చెందారు. భద్రతా బలగాలకు చెందిన ఒక జవాన్ మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్​పార్క్ ఏరియాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఫిబ్రవరి 9న కూడా ఎదురుకాల్పులు జరిగి 31 మంది మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఫిబ్రవరి 9న జరిగిన ఎన్​కౌంటర్లో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్ కౌంటర్లలో 104 మంది మావోయిస్టు మృతి చెందారు.

2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్​షా ప్రకటించిన నాటి నుంచి దండకారణ్యంలో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశారు. అబూజ్​మఢ్​ఏరియా చుట్టూ బేస్​క్యాంపులను ఏర్పాటు చేశారు. ‘లొంగిపోండి.. లేదంటే చంపేస్తాం’ అంటూ మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

ఈ క్రమంలో ఈ సంవత్సరం జరిగిన ఎన్​కౌంటర్లలో 104 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా, 2024లో జరిగిన ఎన్ కౌంటర్లలో 217 మంది మావోయిస్టులు చనిపోయారు. భద్రతా బలగాల వ్యూహాత్మక దాడులతో మావోయిస్టులు చెల్లాచెదురు అవుతున్నారు. తలదాచుకునేందుకు దండకారణ్యం వదిలి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా నిఘావర్గాలు పేర్కొంటున్నాయి.