- తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం
- 15న బస్తర్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
- ఆయన పర్యటనతో అడవిని జల్లెడపడుతున్న బలగాలు
- జనవరి నుంచి 220 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దక్షిణ అబూజ్‌మఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ నెల 10 నుంచి అబూజ్‌మఢ్‌లో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. వెయ్యి మందికి పైగా జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు రేఖవాయి అడవుల్లో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి.
ఇందులో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని, వారి మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయని బస్తర్ ఐజీ సుందర్రాజ్, నారాయణ్‌పూర్ ఎస్పీ ప్రభాత్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఏకే- 47లు, ఎస్ఎల్ఆర్లు, బర్మార్ తుపాకులు, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా, మావోయిస్టులు తిరిగి దాడి చేసే అవకాశం ఉన్నందున అదనపు బలగాలను బ్యాకప్ టీంలుగా పంపుతున్నారు.
పక్కా వ్యూహంతో..!
ఈ నెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బస్తర్ పర్యటనకు వస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ హిడ్మా, ప్రస్తుత మిలటరీ చీఫ్ దేవాల ఇలాకా అయిన పువ్వర్తికి కూడా ఈయన వెళ్లనున్నారు. దీంతో బస్తర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పక్కా వ్యూహంతో భద్రతా బలగాలు చక్రబంధం చేశాయి.
బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఆధ్వర్యంలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో 220 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారని చత్తీస్‌గఢ్ మంత్రి విజయ్‌శర్మ తెలిపారు. చత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులను తరిమికొట్టేందుకు భద్రతా బలగాలు చక్కగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.