ఏఎస్సైని కాల్చి చంపిన కానిస్టేబుల్‌‌

ఏఎస్సైని కాల్చి చంపిన కానిస్టేబుల్‌‌
  • చత్తీస్‌‌గఢ్‌‌ రాజధాని రాయ్‌‌పూర్‌‌ ఐటీబీపీ బెటాలియన్‌‌లో ఘటన

భద్రాచలం, వెలుగు : తనను తరచూ తిడుతున్నాడన్న కోపంతో ఓ కానిస్టేబుల్‌‌ ఏఎస్సైని కాల్చి చంపాడు. ఈ ఘటన చత్తీస్‌‌గఢ్‌‌ రాజధాని రాయ్‌‌పూర్‌‌లోని ఐటీబీపీ క్యాంప్‌‌లో సోమవారం ఉదయం జరిగింది. ఏఎస్సై దేవేంద్రసింగ్‌‌ (56) ఉదయం పరేడ్‌‌కు సిద్ధం అవుతుండగా కానిస్టేబుల్‌‌ సరోజ్‌‌కుమార్‌‌ తన ఇన్సాస్‌‌ రైఫిల్‌‌తో 18 రౌండ్లు కాల్చాడు. 16 బుల్లెట్లు ఏఎస్సై దేవేంద్రసింగ్‌‌ పొట్టలోకి దూసుకెళ్లగా, మరో రెండు గురితప్పాయి.

తీవ్రంగా గాయపడ్డ దేవేంద్రసింగ్ ను తోటి సిబ్బంది హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఏఎస్సై, కానిస్టేబుల్‌‌ మధ్య మూడు రోజుల కింద తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పగ పెంచుకున్న సరోజ్‌‌కుమార్‌‌ సోమవారం ఉదయం దేవేంద్రసింగ్‌‌ వద్దకు వచ్చి సారీ చెప్పిన అనంతరం ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించాడు. విషయం తెలుసుకున్న ఖరోరా పోలీస్‌‌స్టేషన్‌‌ సిబ్బంది సరోజ్‌‌కుమార్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.