ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాలు ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఖచ్చితమైన గెలుపునిచ్చే రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. 1980 వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇరు రాష్ర్టాలు తమ ఓటు బ్యాంకులని కాంగ్రెస్ పార్టీ విశ్వసించింది. 2018లో చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ సాధించిన భారీ విజయానికి గాంధీ కుటుంబం ఆ రాష్ర్ట ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. చత్తీస్‌గఢ్ కూడా తమ ఓటు బ్యాంకుగా మారిందని గాంధీలు భావించారు. కాగా, నవంబర్ 1, 2000న మధ్యప్రదేశ్ నుంచి వేరుపడి చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడింది.
ఇప్పటివరకు కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే చత్తీస్‌గఢ్‌ను పాలించారు. ముగ్గురిలో అజిత్ జోగి 2000–-2003 వరకు సీఎంగా ఉన్నారు. అనంతరం బీజేపీకి చెందిన రమణ్ సింగ్2003 నుంచి- 2018 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవగా కాంగ్రెస్అధికారంలోకి వచ్చింది. 2018 నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన భూపేశ్‌బఘేల్ సీఎంగా కొనసాగుతున్నారు. 2018లో 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 68 మంది ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. బీజేపీ తరఫున కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. ఇతరులు 5 మంది గెలిచారు. ఈసారి కూడా కాంగ్రెస్ భారీ విజయం సాధించి 2023లో కూడా తమ విజయాన్ని పునరావృతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
హస్తం పార్టీ బలహీనతలు
చత్తీస్‌గఢ్‌లో భూపేశ్‌బఘేల్ ఏకఛత్రాధిపత్య పాలనపై కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ, ఆయన గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కాబట్టి ఎవరూ ఫిర్యాదు చేయడానికి సాహసించడం లేదు. అయితే కాంగ్రెస్ నేతల్లోని ఒక వర్గంలో నివురుగప్పిన నిప్పులా ఆగ్రహం దాగి ఉంది. మరోవైపు చత్తీస్‌గఢ్‌లో బీజేపీకి జనాకర్షణ కలిగిన పెద్ద నాయకుడు లేడు. కానీ, నరేంద్ర మోదీ ఇమేజ్ చాలా ఎక్కువ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్యే స్థానాల్లో 11 మందిని కాంగ్రెస్ గెలుచుకున్న బస్తర్ ప్రాంతంలో రెండు వారాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ భారీ సమావేశం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. చత్తీస్‌గఢ్‌లో 33శాతం గిరిజనులు ఉన్నారు. 2018లో కాంగ్రెస్‌కు ఆదివాసీల ఓట్లు భారీ మెజారిటీని అందించాయి. గిరిజనులు ప్రస్తుతం కాంగ్రెస్ ఓటు బ్యాంకులని రాహుల్ గాంధీ భావించారు. అయితే చాలామంది గిరిజనులు మళ్లీ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.
ఉచితాలు, నగదు పథకాల కారణంగా తాము అధికార వ్యతిరేకతను నియంత్రించామని కాంగ్రెస్ భావించింది. కానీ, బొగ్గు కుంభకోణం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కుంభకోణాలు వంటి అనేక అవినీతి స్కామ్‌ల కారణంగా అధికార పార్టీ పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. భూపేశ్బఘేల్ను ఎదిరించిన లీడర్లు ఎవరికీ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ దక్కలేదు. దీంతో నిరాశ చెందిన కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. 2018లో బీజేపీకి ఉన్న అసమ్మతి, నేడు కాంగ్రెస్‌కు ఉంది.
బీజేపీ బలోపేతం
2018లో ఓటమి తర్వాత చత్తీస్‌గఢ్‌లో బీజేపీ నిశ్శబ్దంగా తమ బలాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గత రెండు నెలల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆశ్చర్యపరిచేలా బీజేపీ బలోపేతమైంది. సరైన సమయం వచ్చేవరకు తమ బలాన్ని దాచుకోవాలనే చైనా వ్యూహాన్ని బీజేపీ అనుసరించినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే స్థానాల్లో ఎంపీలను బరిలోకి దింపాలనే వ్యూహాన్ని బీజేపీ పాటిస్తున్నది. చత్తీస్‌గఢ్‌లో బీజేపీ తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించింది. ఎంపీలను పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే పార్లమెంటు సభ్యులు సాధారణంగా ఎమ్మెల్యేల కంటే బలమైన అభ్యర్థులుగా పరిగణిస్తారు. అంతేకాకుండా భారీస్థాయిలో ప్రచారం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం సృష్టిస్తుంది.
అధికార సాధన వ్యూహంలో భాగంగా చత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై వివిధ అవినీతి కేసులతో కేంద్రంలోని బీజేపీ సర్కారు దాడి చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలను బీజేపీ ఎన్నికల ప్రచారంలో అస్ర్తాలుగా వాడుకుని ముందుకు వెళితే హస్తం పార్టీకి ఎదురుగాలి తప్పదు. ప్రజల్లో అధికార ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న జనాకర్షణ చత్తీస్‌గఢ్‌లో మళ్లీ తమపార్టీని అధికారంలోకి తీసుకువస్తుందని భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నది.
బఘేల్‌ను ఇష్టపడుతున్న గాంధీలు
గాంధీలకు ఇష్టమైన ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అని ఇండియా టుడే సర్వే వెల్లడించిన తరువాత నుంచి కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది. బఘేల్కూడా గొప్పచాతుర్యం ఉన్న కాంగ్రెస్ నేత. కొన్ని నెలల క్రితం రాయ్‌పూర్‌లో జరిగిన ఏఐసీసీ సెషన్‌కు ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు.. ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోసం గులాబీల రహదారిని ఏర్పాటు చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రిని గాంధీలే కాదు ఎవరైనా ఎందుకు ఇష్టపడరు! ప్రస్తుతం చత్తీస్‌గఢ్ ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమే. అయితే 2018లో భాజపా పూర్తిగా పరాజయం పాలైనప్పటి పరిస్థితి నుంచి ఇప్పుడు కమలం పార్టీ బయటపడిందన్నది వాస్తవం.
కాంగ్రెస్ రేసులో ముందుంది. కానీ బీజేపీ దాన్ని అధిగమించగలదా అనేది ప్రశ్న. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చత్తీస్‌గఢ్‌పై కాంగ్రెస్ పార్టీకి పూర్తి విశ్వాసం ఉంది. ఒకవేళ చత్తీస్‌గఢ్‌లో పరాజయం పాలైతే కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదు. దీని ప్రభావం వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఏ మేరకు పడుతుందనేది కూడా ఫలితాలు వెల్లడైన తరువాత తెలుస్తుంది.
కాంగ్రెస్ బలం
భూపేశ్ బఘేల్ చాలా చురుకైన ముఖ్యమంత్రి. ఆయన ఓటర్లును ఆకర్షించే అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఓటర్లు ఉచితాలు లేదా డబ్బువైపే ఆకర్షితులై విజయాన్ని అందిస్తారనేది రాజకీయ వర్గాల్లో ప్రగాఢ నమ్మకం. చాలామంది ముఖ్యమంత్రులు వీటివల్ల తమ విజయం ఖాయమని ఇప్పటికీ నమ్ముతున్నారు. భూపేశ్ బఘేల్‌పై కాంగ్రెస్ నేతల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. పైగా గాంధీ కుటుంబం కూడా ఆయనకు పూర్తి మద్దతునిస్తుంది. భూపేశ్ బఘేల్ తమ అభిమాన ముఖ్యమంత్రి అని గట్టిగానే చెపుతారు. దీంతో ఆయనపట్ల ప్రతి కాంగ్రెస్ నేత తమ వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చేయకుండా మౌనంగానే ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి మరణానంతరం ఆయన పార్టీ జనతా కాంగ్రెస్ హవా చత్తీస్‌గఢ్ లో తగ్గింది. పలువురు అజిత్ జోగి పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. భూపేశ్ బఘేల్ తన ప్రభుత్వం గురించి వార్తాపత్రికలు, టీవీలలో చాలా ఖర్చుపెట్టి భారీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఆయనతో ఓటర్లు ఏకీభవిస్తారో లేదో అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ, తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది. ఏదైనా పెద్ద టీవీ ఛానెల్‌ని ఆన్ చేయగానే సీఎం భూపేశ్ బఘేల్ ప్రజలను కౌగిలించుకుంటూ కనిపిస్తారు. భారీస్థాయిలో మీడియాలో ప్రచారానికి భూపేశ్ బఘేల్సర్కారు వెనుకాడటం లేదు. ఉచిత పథకాలు తమను మరోసారి అధికారంలోకి తీసుకురావచ్చనే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది.
సర్వేలుఏం చెబుతున్నాయంటే..
ఇటీవల పలు మీడియా సంస్థలుచత్తీస్గఢ్లో నిర్వహించిన ఎన్నికల సర్వేలను విడుదల చేశాయి. ఇండియా టుడే టీవీ సంస్థ చత్తీస్‌గఢ్‌కు సంబంధించిన ఒక సర్వేను విడుదల చేసింది. రెండు నెలల క్రితం వరకు బీజేపీ 90 అసెంబ్లీ స్థానాల్లో 30స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. గత రెండు వారాల్లో బీజేపీ బలం మరింత పెరిగినట్లు పేర్కొంది. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 42 మంది బీజేపీ ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. చత్తీస్‌గఢ్‌లో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా సుర్గుజా మాజీ మహారాజు టీఎస్ సింగ్ గుర్తింపు పొందారు. 2018లో సింగ్ డియోను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చేయాలని భావించారు. అందుకే రాజ్‌పుత్‌లు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. చత్తీస్‌గఢ్ అనే పేరుకు ‘36 రాజాల కోటలు’ అని అర్ధం. వందల సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్ రాజులచేత పాలించబడింది. చత్తీస్‌గఢ్‌లోని అత్యంత శక్తిమంతమైన కులం రాజపుత్రులు. ఇప్పుడు సింగ్‌ను కాంగ్రెస్పక్కన పెట్టడంతో రాజ్‌పుత్‌లు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావిస్తున్నారు.
- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్