నక్సల్స్ దాడి ఘటన..  సొంతూర్లకు పోలీసుల డెడ్ బాడీలు

  • నక్సల్స్ దాడి ఘటన..  సొంతూర్లకు పోలీసుల డెడ్ బాడీలు
  • మిన్నంటిన రోదనల నడుమ శవపేటిక మోసిన సీఎం
  • అమరుల త్యాగాలను వృథా కానివ్వబోమన్న భగేల్
  • నక్సలైట్లపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని వెల్లడి

దంతెవాడ:  అమరులైన పోలీసుల త్యాగం వృథా కాదని, నక్సలైట్లపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చత్తీస్ గఢ్​ సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. నక్సల్స్ దాడిలో చనిపోయిన పోలీసుల మృతదేహాలకు గురువారం కర్లీ ప్రాంతంలోని పోలీస్ లైన్స్ లో ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల డెడ్​బాడీలను వాళ్ల స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన వెహికల్ వరకు ఓ శవపేటికను ఆయన మోశారు. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్నవాళ్లందరినీ కంటతడి పెట్టించాయి. ఓ పక్క వారి పిల్లలు, బంధువుల రోదనలు, మరోపక్క భారత్ మాతాకీ జై నినాదాల నడుమ డెడ్​బాడీలను వాళ్ల సొంతూర్లకు తరలించారు. అనంతరం బఘేల్ మీడియాతో మాట్లాడుతూ.. అమరుల కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చత్తీస్​గఢ్​లోని దంతెవాడలో నక్సల్స్ బుధవారం మందుపాతర పేల్చడంతో 10 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పోలీసులు, ఓ ప్రైవేటు వ్యాన్ డ్రైవర్ చనిపోయారు. దర్బా డివిజన్ ఏరియాలో కూంబింగ్ అనంతరం పోలీసులు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.   

బ్లాస్టింగ్ స్పాట్ లో కాల్పులు.. వీడియో వైరల్

నక్సల్స్ సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన వీడియో గురువారం వైరల్ అయింది. బాంబు పేల్చిన తర్వాత కూడా నక్సల్స్ కాల్పులు జరిపారు. బ్లాస్టింగ్ జరిగిన కొద్ది నిమిషాల్లోనే అదే తోవలో వస్తున్న డీఆర్జీ పోలీసుల మరో వెహికల్ స్పాట్​కు చేరుకుంది. అందులో ఉన్న పోలీసు నక్సల్స్ పై కాల్పులు జరిపేందుకు పొజిషన్ తీసుకుంటూ కనిపించాడు. వెహికల్ కింద దాక్కున్న మరో పోలీసు కొద్ది సెకన్లపాటు వీడియో తీశాడు. నక్సలైట్లు ఫైరింగ్ జరుపుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గన్ ఫైరింగ్ శబ్దంతో పాటు, వెహికల్ మొత్తం పేలిపోయింది అని ఒక గొంతు వినిపిస్తోంది. బ్లాస్ట్ అయిన వెహికల్ వెనుక 100 నుంచి 150 మీటర్ల దూరంలో తమ వెహికల్ వస్తోందని ఆ పోలీసు మీడియాకు తెలిపారు. తాము   కాల్పులు జరిపినప్పుడు, అటునుంచి ఒకట్రెండు రౌండ్ల కాల్పులు జరిగాయని, ఆపై ఆగిపోయాయని చెప్పారు.  

పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు

.చత్తీస్​గఢ్ నబరంగ్‌‌పూర్ జిల్లాలోని రాయ్‌‌గఢ్ ప్రాంతంలో ఒడిశా పోలీసులకు మావోయిస్టులకు మధ్య బుధవారం భీకర కాల్పులు జరిగినట్లు జిల్లా ఎస్పీ సుశ్రీ తెలిపారు. మురళి (మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు), కార్తీక్, గుడ్డు, ఆకాశ్, నందల్​తో సహా 25 మంది సాయుధ సీపీఐ (మావోయిస్ట్) కార్యకర్తల శిబిరాన్ని గుర్తించామన్నారు. అక్కడికి పోలీసులు చేరుకోగానే మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో డిఫెన్స్ పోలీసుల టీం ఎదురుకాల్పులకు దిగిందని వివరించారు.