
- మృతుల్లో ఎస్జెడ్సీ మెంబర్ సుధీర్ అలియాస్ సుధాకర్
- ఘటనాస్థలంలో 303 రైఫిళ్లతో పాటు 12 బోర్ తుపాకులు సీజ్
- మిగిలినవారి కోసం 500 మందితో జల్లెడ పడుతున్న అధికారులు
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. గీదం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గిర్సాపారా, నెల్గోడ, బొడ్గా గ్రామ అడవుల్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సంచరిస్తుందన్న ఇంటెలిజెన్స్ వర్గాల పక్కా సమాచారంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఏఎఫ్ బలగాలు గాలింపు చేపట్టాయి. సుమారు 500 మందితో ఈ ప్రాంతాలను జల్లెడ పట్టారు.
బలగాలకు దండకారణ్యం స్పెషల్ జోనల్‌కమిటీ దళం కనిపించగా..ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోగా మిగిలినవారు పారిపోయారు. ఘటనా స్థలంలో ఇన్సాస్, 303 రైఫిళ్లతో పాటు 12 బోర్ తుపాకీ, డిటోనేటర్లు, మందులు, నిత్యావసర సరుకులను అధికారులు సీజ్ చేశారు. మృతులను స్పెషల్జోనల్ కమిటీ మెంబర్సుధీర్అలియాస్సుధాకర్ అలియాస్మురళి, దళ సభ్యులు ఆత్రం పండ్రూ, బార్సా మన్నూగా పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాకు చెందిన సుధీర్‌పై రూ. 25 లక్షల రివార్డు ఉందని బస్తర్ఐజీ సుందర్రాజ్వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఇది పెద్ద విజయం: ఐజీ
దంతెవాడ ఎన్ కౌంటర్ మావోయిస్టులపై సాధించిన అతి పెద్ద విజయంగా ఐజీ సుందర్రాజ్, డీఐజీ కమలోచన్ కశ్యప్ అన్నారు. దండకారణ్యం స్పెషల్జోనల్కమిటీలో అగ్రనేతను బలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. 2026 మార్చి నాటికి దండకారణ్యాన్ని మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. 2025లో 83 రోజుల్లో 100 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం భద్రతాబలగాలలో పెరిగిన ఆత్మస్థైర్యానికి నిదర్శనమని చెప్పారు.
మార్చి నుంచి జూన్వరకు టీసీఓసీ( టాక్టికల్ కౌంటర్అఫెన్సివ్ క్యాంపెయిన్)పేరుతో మావోయిస్టులు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. పోలీస్స్టేషన్లపై అటాక్స్ చేయడం, భద్రతా బలగాలను అంబుష్చేసి చంపడం వంటి అనేక దాడులు ఈ కాలంలో చేస్తున్నారు. కానీ, గత రెండేళ్లుగా టీసీఓసీని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.
మావోయిస్టుల్లో భయాన్ని బయటపెట్టిన లేఖ
కేంద్ర హోంశాఖ 2026 నాటికి చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని ప్రకటన చేసి..అనంతరం దాడులు ఉధృతం చేసింది. విప్లవ కారిడార్ రాజధాని అబూజ్మాఢ్లోనూ బేస్ క్యాంపుల్లోకి భద్రతా బలగాలు చొచ్చుకుని పోయి దాడులు చేస్తున్నాయి. "లొంగిపోండి లేకుంటే చనిపోండి" అనే నినాదంతో జరుగుతున్న దాడులు.. మావోయిస్టు దళ సభ్యుల్లో భయం పుట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల ఎన్కౌంటర్ ప్రదేశాల్లో భద్రతా బలగాలకు దొరికిన ఒక లేఖ దీన్ని నిర్ధారిస్తోంది. మావోయిస్టు లీడర్ మోటూ తన భార్య నక్సల్ కమాండర్ మంగీకి లేఖ రాసి ప్రస్తుత పరిస్థితులను వివరించాడు. పార్టీపై జరుగుతున్న దాడులు, ఎన్కౌంటర్లు, కేంద్ర హోంశాఖ అల్టిమేటం, సభ్యుల భయం ఆయన లేఖలో కన్పించాయి. దళాల్లో అభద్రతా భావం భద్రతాబలగాల్లో బలం రెట్టింపు చేసిందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.