ఇయ్యాల (ఏప్రిల్ 2) మావోయిస్ట్ రేణుక అంత్యక్రియలు, హాజరుకానున్న ప్రజాసంఘాల నాయకులు

ఇయ్యాల (ఏప్రిల్ 2) మావోయిస్ట్ రేణుక అంత్యక్రియలు, హాజరుకానున్న ప్రజాసంఘాల నాయకులు
  • సొంతూరు కడవెండికి చేరుకున్న మావోయిస్ట్‌‌ రేణుక డెడ్‌‌బాడీ
  •  చివరి చూపు కోసం తరలివచ్చిన గ్రామస్తులు, ఉద్యమకారులు

జనగామ, వెలుగు : చత్తీస్‌‌గఢ్‌‌లో జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయిన, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన గుమ్మడవెల్లి రేణుక కడసారి చూపు కోసం కుటుంబసభ్యులు, గ్రామస్తులు, ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు గ్రామానికి చేరుకుంటున్నారు. రేణుక డెడ్‌‌బాడీ మంగళవారం అర్ధరాత్రి గ్రామానికి చేరుకుంది. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేణుక డెడ్‌‌బాడీని ఆమె సోదరులు జీవీకే ప్రసాద్, రాజశేఖర్‌‌ దంతెవాడ నుంచి తీసుకురాగా.. హైదరాబాద్‌‌లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు సోమయ్య, జయమ్మలు కడవెండికి చేరుకున్నారు. దంతెవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రేణుక డెడ్‌‌బాడీకి పోస్ట్‌‌మార్టం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు డెడ్‌‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌‌లో స్వగ్రామానికి తరలించారు. 

మార్గమధ్యలో ప్రజాసంఘాల నాయకులు, ఉద్యమకారులు రేణుక డెడ్‌‌బాడీకి నివాళులర్పించారు. రేణుక తల్లిదండ్రులను గ్రామస్తులు పరామర్శించారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. కడవెండిలో జరగనున్న మావోయిస్ట్‌‌ రేణుక అంత్యక్రియలకు ప్రజా సంఘాల లీడర్లు భారీ సంఖ్యలో హాజరుకానున్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంత్యక్రియలకు ఎవరెవరు వస్తారని ఇప్పటికే ఆరా తీస్తున్నారు. వందలాది మంది పోలీసులు మఫ్టీలో జనంలో కలిసి పోయి ప్రజా సంఘాల లీడర్ల కదలికలపై కన్నేయనున్నట్లు సమాచారం. 

మావోయిస్ట్‌‌ పార్టీలో ముగిసిన కడవెండి ప్రస్థానం

రేణుక ఎన్‌‌కౌంటర్‌‌తో మావోయిస్ట్‌‌ పార్టీలో కడవెండి ప్రస్తానం ముగిసినట్లైంది. ఇదే గ్రామానికి చెందిన ఎర్రంరెడ్డి సంతోష్‌‌రెడ్డి, పురుషోత్తంరెడ్డిలు అప్పట్లో పీపుల్స్‌‌వార్‌‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. పురుషోత్తంరెడ్డి దండకారణ్య స్పెషల్‌‌ జోనల్‌‌ కమిటీ సభ్యుడి హోదాలో ఉన్న టైంలో అనారోగ్యం కారణంగా లొంగిపోయారు. సంతోష్‌‌రెడ్డి ఉద్యమంలోనే కొనసాగి ఉమ్మడి రాష్ట్ర పీపుల్స్‌‌వార్‌‌ కార్యదర్శిగా ఎదిగారు. ఈ క్రమంలో కరీంనగర్‌‌ జిల్లా కొయ్యూరులో జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయాడు. 

ఇదే గ్రామానికి చెందిన పైండ్ల వెంకటరమణ నర్సంపేట పీపుల్స్‌‌ వార్‌‌ ఆర్గనైజర్‌‌గా పనిచేస్తూ 1986లో నాచినపల్లిలో జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోగా, మరో ఉద్యమకారుడు పెద్ద శ్రీను నెక్కొండ ఏరియా దళ కమాండర్‌‌గా పనిచేస్తూ ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయాడు. రేణుక సోదరుడు, మావోయిస్ట్‌‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన జీవీకే ప్రసాద్‌‌ అలియాస్‌‌ ఉసెండీ అనారోగ్య కారణాలతో 2014లో లొంగిపోయారు. ఇక మిగిలిన రేణుక తాజాగా జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోవడంతో కడవెండి ఉద్యమకారుల ప్రస్థానం ముగిసినట్లైంది.  

రేణుక కుటుంబాన్ని పరామర్శించిన గాజర్ల అశోక్‌‌

చనిపోయిన మావోయిస్ట్‌‌ రేణుక కుటుంబాన్ని మంగళవారం కడవెండిలో మాజీ మావోయిస్ట్‌‌ గాజర్ల అశోక్‌‌ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దండకారణ్యంలో రక్తపాతం ఆపాలని డిమాండ్‌‌ చేశారు. ప్రజా సమస్యలపై పరిశోధనాత్మక జర్నలిస్ట్‌‌గా రేణుక పనిచేసిందన్నారు. యుద్ధరంగంలో కంటే ప్రజా సమస్యల చిత్రీకరణపైనే ఎక్కువగా పనిచేసిందని, రేణుక మరణం బాధాకరం అన్నారు. ఆయన వెంట గాదె ఇన్నయ్య ఉన్నారు.