సెప్టిక్ ట్యాంక్‎లో శవమై తేలిన యువ జర్నలిస్ట్.. అసలేం జరిగిందంటే..?

సెప్టిక్ ట్యాంక్‎లో శవమై తేలిన యువ జర్నలిస్ట్.. అసలేం జరిగిందంటే..?

ఛత్తీస్ గఢ్‎లో అనుమానస్పదస్థితిలో మృతి చెందిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‎గా తీసుకుంది. ఈ క్రమంలోనే ముఖేష్ మృతిపై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ శనివారం (జనవరి 4) ప్రకటించారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మయాంక్ గుర్జార్ నేతృత్వంలో 11 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 

పోలీసులు 3-4 వారాల్లో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్‌ను సమర్పిస్తారని పేర్కొన్నారు. కేసులో ప్రధాన నిందితుడు సురేష్ చంద్రకర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు బృందాలు ఏర్పాటు చేశారని చెప్పారు. కాగా, జనవరి 1న ఇంటి నుంచి బయటకెళ్లిన ముఖేష్ చంద్రకర్ (33) అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ శుక్రవారం బీజాపూర్ పట్టణంలోని ఓ సెప్టి్క్ ట్యాంక్‎లో శవమై తేలాడు.

 సురేష్ చంద్రకర్‌ అనే సివిల్ కాంట్రాక్టర్ అవకతవకలను బయటపెట్టిన కొన్ని రోజులకే ముఖేష్ అనుమానస్పదరీతిలో మృతి చెండటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్‎గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు.