
- దండకారణ్యంలోని రాయగూడెం ఆదివాసీలతో భేటీ
భద్రాచలం, వెలుగు: మావోయిస్టుల అడ్డా అయిన చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండలోని రాయగూడెనికి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి విజయ్‌శర్మ సీఆర్‌పీఎఫ్ జవాన్ బైక్‌పై వెళ్లారు. ఆయనతో పాటు బస్తర్ ఐజీ సుందర్ రాజ్, సీఆర్ పీఎఫ్ డీఐజీ సూరజ్ పాల్ వర్మ, సుక్మా కలెక్టర్ దేవేశ్ కుమార్ ధృవ్, ఎస్పీ కిరణ్‌చౌహాన్ కూడా బైక్‌లపై రాయగూడెంకు చేరుకున్నారు.
ఈ ప్రాంతాన్ని మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా ఇలాకాగా పేర్కొంటారని, ఇక్కడికి బైక్‌పై రావడం సాహసంతో కూడిన పని అని స్థానిక రాజకీయ నాయకులు అన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా సందర్శించని తమ గ్రామానికి మంత్రి, కలెక్టర్, ఎస్పీ, ఐజీ, డీఐజీలు రావడంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. తొలుత జవాన్లతో భేటీ అయిన హోం మంత్రి.. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లు, దండకారణ్యంపై పట్టు సాధించిన తీరుపై భద్రతా బలగాలను అభినందించారు. అనంతరం ఆదివాసీలతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మావోయిస్టు పార్టీ అమాయక ఆదివాసీలను బెదిరించి తీసుకెళ్లి బలిపశువులను చేస్తున్నదని విజయ్ శర్మ మండిపడ్డారు. ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు.