Telangana Tour : ఛాయా సోమేశ్వరాలయం.. హైదరాబాద్ నుంచి 4 గంటల్లో వెళ్లొచ్చు..

భారతీయ వాస్తు, శిల్పకళ గొప్పతనం భాతెలుసుకోవాలంటే రాజుల కాలంలో కట్టించిన గుళ్లు, గోపురాలు, కోటలు చూడాల్సిందే. నల్గొండ జిల్లా పానగల్లులో ఉన్న 'శ్రీ ఛాయా సోమేశ్వరాలయం'లో చారిత్రక ఆనవాళ్లు చాలా ఉన్నాయి. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కందూరి చోళ రాజులు తెల్లని రాయితో కట్టించారు. గర్భ గుడిలోని శివలింగం మీద వెలుతురు ఉన్నంత సేపు స్తంభం నీడ పడుతుండడం ఈ ఆలయం స్పెషాలిటీ.

అసలు ఈ స్తంభం నీడ ఎక్కడి నుంచి పడుతుందనేది ఇప్పటికీ మిస్టరీనే. సూర్యుని భార్య ఛాయాదేవి నీడ శివునిపై పడుతున్నందున ఈ ఆలయానికి 'ఛాయా సోమేశ్వరాలయం' అని పేరొచ్చింది.

ఈ ఆలయం ఆవరణలో సూర్యుడు, విష్ణువు. శివుడి ఆలయాలు ఉంటాయి. మూడు గర్భాలయాలు ఒకేచోట ఉన్నందున దీన్ని 'త్రికూటాలయం' అని కూడా పిలుస్తారు. తూర్పున సూర్యదేవాలయం, పడమర దిక్కున శివాలయం, ఉత్తరాన విష్ణు ఆలయం ఉంటుంది. ఇక్కడి శివలింగాన్ని 'జల లింగం' అని పిలుస్తారు. ఇక్కడి కోనేరులో ఏడాదంతా నీళ్లు ఉంటాయి.

గద, శంఖు చక్రాలు చెక్కిన గోడలు, దేవనాగరి లిపిలో ఉన్న శాసనాల్ని చూడొచ్చు. పిల్లర్స్ మీద రామాయణ, మహాభారత ఉదంతాల శిల్పాలు చెక్కారు. మహాశివరాత్రి రోజున భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తారు. 

ఇలా వెళ్లాలి...

నల్గొండ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది 'శ్రీ ఛాయా సోమేశ్వరాలయం'.. హైదరాబాద్ నుంచి 104 కిలోమీటర్ల జర్నీ. దర్శనం: ఉదయం 6 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు.