అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌కు జీవిత ఖైదు విధించిన ముంబై కోర్టు

అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌కు జీవిత ఖైదు విధించిన ముంబై కోర్టు

న్యూఢిల్లీ: 2001 నాటి ముంబై వ్యాపారవేత్త జయశెట్టి హత్య కేసులో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌కు ముంబైలోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. మే 30వ తేదీ గురువారం ఈ కేసు విచారించిన కోర్టు.. మే 31వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున ఛోటా రాజన్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.  

సెంట్రల్ ముంబైలోని గామ్‌దేవి ప్రాంతంలో ఉన్న గోల్డెన్ క్రౌన్ హోటల్‌ యజమాని జయ శెట్టికి ఛోటా రాజన్ గ్యాంగ్‌ నుండి చంపుతామని బెదిరింపులు వచ్చాయి. దీంతో శెట్టికి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అయితే, శెట్టి అభ్యర్థన మేరకు అతని భద్రతను తొలగించారు. దీంతో రెండు నెలల తర్వాత 2001, మే 4న ఛోటా రాజన్ గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యులు శెట్టిని హోటల్ మొదటి అంతస్తులో కాల్చి చంపారు. 

Also read : ఢిల్లీ... శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు

ఈ హత్య కేసులో.. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి అయిన ఏఎం పాటిల్, ఇండియన్ పీనల్ కోడ్ హత్య నిబంధనల ప్రకారం రాజన్‌ను దోషిగా నిర్ధారించారు. దీంతో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష తోపాటు రూ.16 లక్షల జరిమానా విధించారు. మిగిలిన ఇద్దరికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.