వెలుగు, లైఫ్: మనం తరచూ వినే కొన్ని ఆహార పదార్థాల గురించి ఎంత చెప్పినా పట్టించుకోం. ఎవరైనా చెప్పినా.. హా ఏముందిలే.. అని కొట్టిపారేస్తాం. కానీ చియా గింజల గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. వీటి వలన ఎన్ని రోగాలు తగ్గుతాయో.. ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ ఆర్టికల్ చదివితే తెలుస్తుంది.
ప్రస్తుకు బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరూ.. త్వరగా శక్తినిచ్చే పదార్థాలు తినాలనుకుంటారు. అలాంటి ఆహారమే 'చియా' గింజలు. చూడటానికి చిన్న గింజలే అయినా.. ఇవి అద్భుతమైన ఆహారంగా శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఈ గింజల ద్వారా బరువు, డయాబెటిస్ తగ్గడమే కాకుండా గుండె, ఎముకల ఆరోగ్యాన్ని దృఢపరుస్తుందని తేల్చి చెప్పారు. శరీరం, మెదడు చురుకుగా ఉండటానికి చియా గింజలు ఎంతో దోహదపడతాయి.
- పుదీనా మొక్క జాతి
అత్యంత ప్రజాదరణ పొందిన.. ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాల జాబితాలో కొత్తగా చేరాయి చియా గింజలు. ఈ గింజలు పుదీనా జాతికి చెందిన 'సాల్వియా హిస్పానికా' మొక్క నుంచి సేకరిస్తారు. ఈ మొక్కలు సాధారణంగా దక్షిణ అమెరికాలో పెరుగుతాయి. వీటి పరిమాణం చిన్నవిగా ఉన్నప్పటికీ, ఈ గింజలు భూమి మీద లభించే అత్యంత పోషక పదార్థాల్లో ఒకటిగా చెప్పొచ్చు. చియా గింజల్లో 15.25 శాతం ప్రోటీన్, 26.41 శాతం కార్బో హైడ్రేట్లు, 30.33 శాతం కొవ్వులు, 18.30 శాతం పీచు, ఖనిజాలు, విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
- ఎక్కువ ఖనిజాలు
చియా గింజలు ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం అందిస్తాయి. ఈ గింజల్లో ఒమెగా3 కొవ్వు ఆమ్లాలు (Omega3 Fatty Acids) కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు తీసుకోవడం వల్ల రక్తంలో ఏఎల్ఎ (ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్) స్థాయి, ఈపీఏ (ఎకోసాపెంటానోక్ యాసిడ్) పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read : భోజనానికి ముందు నీళ్లు తాగొచ్చా.. తాగకూడదా..? ఏది నిజం
- అధిక మొత్తంలో పీచు పదార్థాలు
వంద గ్రాముల చియా గింజల్లో సుమారు 34 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. చియాలో ఉండే పీచు పదార్థం గింజ బరువుకు 12 రెట్లు ఎక్కువగా నీటిని పీల్చుకుంటుంది. దీంతో నెమ్మదిగా జీర్ణం జరిగి.. గ్లూకోజ్ విడుదల కూడా నెమ్మదిస్తుంది. కాబట్టి ఇది డయాబెటిస్ రోగులకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్లాస్మా కొలెస్ట్రాల్ ను కూడా చియా గింజలు తగ్గిస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి.. చియా గింజల్ని తగిన మోతాదులో ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవచ్చు. మరి మీరు కూడా చియా సీడ్స్ మీ డైట్ లో ఉండేలా ప్లాన్ చేస్తారు కదూ.