![అక్కంపల్లి రిజర్వాయర్‌లో కోళ్ల కళేబరాలు](https://static.v6velugu.com/uploads/2025/02/chicken-carcasses-in-akkampalli-reservoir_j8PN1Ge0kK.jpg)
- ఇక్కడి నుంచే హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా
- ఘటనపై నల్గొండ జిల్లా అధికారులు సీరియస్.. అదుపులోకి నిందితుడు
- ఆందోళన అవసరం లేదు: మెట్రో వాటర్ బోర్డ్ అధికారులు
హైదరాబాద్ సిటీ/దేవరకొండ (పెద్ద ఆడిశర్లపల్లి), వెలుగు: హైదరాబాద్ తోపాటు నల్గొండజిల్లాలోని గ్రామాలకు తాగునీరు సరఫరా అయ్యే నల్గొండ జిల్లా పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో బాయిలర్ కోళ్ల కళేబరాలు ప్రత్యక్షమయ్యాయి.
ఈ మేరకు గురువారం ఓ యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ అధికారులను ఎంక్వైరీకి ఆదేశించారు. దీంతో శుక్రవారం ఉదయం అక్కంపల్లి రిజర్వాయర్ వద్దకు చేరుకున్న అధికారులు.. జాలర్ల సహాయంతో సుమారు 60 కోళ్ల కళేబారాలను బయటకు తీశారు. మృతి చెందిన బాయిలర్ కోళ్లు బర్డ్‌ఫ్లూతో చనిపోయాయా? లేదా? తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపాలని వెటర్నరీ డాక్టర్ మహేందర్ రెడ్డిని ఆర్డీవో ఆదేశించారు.
12 గంటల్లో నిందితుడి గుర్తింపు
అక్కంపల్లి బాలెన్సింగ్ రిజర్వాయర్ లో చచ్చిన బాయిలర్ కోళ్లను వేసిన నిందితుడిని 12 గంటల వ్యవధిలో పోలీసులు పట్టుకున్నారు. దేవరకొండ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎస్పీ మౌనిక ఈ కేసు వివరాలు వెల్లడించారు.
అక్కంపల్లి రిజర్వాయర్ సమీప గ్రామం వద్దిపట్ల పడమటి తండా శివారులోని ఓ పౌల్ట్రీ యజమాని రాయమల్లును నిందితుడిగా గుర్తించారు. అతడి పౌల్ట్రీలో కోళ్లు పెద్దసంఖ్యలో మృతి చెందిన విషయం తెలుసుకొని, విచారించారు. దీంతో అతడు నిజం ఒప్పుకున్నాడు. తన పౌల్ట్రీలో చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చి పెట్టడానికి ఎక్కువ ఖర్చవుతుందని.. బుధవారం తెల్లవారుజామున అక్కంపల్లి రిజర్వాయర్‌లో పడేసినట్టు చెప్పాడు. బర్డ్‌ఫ్లూ అనే భయంతోనే ఇలా చేశానని వెల్లడించాడు. దీంతో ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఎలాంటి ప్రమాదం లేదు: వాటర్ బోర్డు అధికారులు
గ్రేటర్ హైదరాబాద్‌కు తాగు నీటిని అందిస్తున్న కృష్ణా జలాల్లో (అక్కంపల్లి రిజర్వాయర్) చనిపోయిన కోళ్లు ప్రత్యక్షం కావడంపై మెట్రో వాటర్ బోర్డు అధికారులు స్పందించారు. దీని వల్ల నగరంలో తాగు నీటి నాణ్యతకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్, రెవెన్యూ, వాటర్ బోర్డు అధికారులు అప్రమత్తమై.. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
వాటర్ బోర్డుకు చెందిన క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ వింగ్ (క్యూఏటీ) అధికారులతో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), థర్డ్ పార్టీ లూసిడ్ సంస్థ.. కోదండపూర్ వాటర్ ఫ్యూరిఫైర్ సెంటర్‌ను సందర్శించి, నీటి నమూనాలను సేకరించారు. ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలు గుర్తించలేదని తెలిపారు.
ఈ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐఎస్ ప్రమాణాలతో మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని అధికారులు వివరించారు. వచ్చే వారంపాటు.. ప్రతి గంటకూ నీటి నాణ్యతను పరీక్షిస్తామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.