సిద్దిపేటలో నోరూరించే నాన్ వెజ్ పచ్చళ్లు

సిద్దిపేటలో నోరూరించే నాన్ వెజ్ పచ్చళ్లు

సిద్దిపేట రూరల్, వెలుగు : రాత్రి పది గంటలు.. సిద్దిపేట జిల్లా ఇర్కోడ్​ విలేజ్​. గ్రామస్తులంతా భోజనాలు చేసి నిద్రకు రెడీ అవుతున్నారు. ఊరి చివర్లో ఉన్న ‘మహిళా సమాఖ్య భవన్​’లో మాత్రం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ‘పచ్చళ్లు తయారీకి ఏయే ఐటమ్స్​ కావాలి’ అని లిస్టు రాసుకుంటూ ఒకరు, ‘నాటుకోళ్లు, మేకలను ఆర్డర్ చేశారా’​ అంటూ మరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఊళ్లలో రాత్రి తొమ్మిది కొట్టగానే నిద్రలోకి జారుకుంటారు. కానీ పది అయినా పని గురించి ఆలోచిస్తున్నారు ‘ఇర్కోడ్​ మహిళా సమాఖ్య’ మహిళలు.

వాళ్లంతా గ్రామీణ మహిళలు… బీడీలు చుడితేనే బతుకు బండి నడుస్తుంది. లేదంటే పస్తులు ఉండాల్సిందే. వేరే మార్గం లేక బీడీలు చుడుతూ పొట్ట నింపుకునేవాళ్లు. దాని వల్ల కాస్తో కూస్తో ఆదాయం అయితే దొరికింది. కానీ బీడీల మాటున దగ్గు, దమ్ము, క్యాన్సర్​ లాంటి జబ్బులు గుప్పుమనేవి. ‘ఏం చేస్తం.. మా కర్మ ఇంతే’ అంటూ పనిచేసేవాళ్లు కొందరు. ‘భవిష్యత్తు బాగుండాలంటే కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి’ అని ఆలోచించేవాళ్లు మరికొందరు. కష్టమైనా ఇష్టంతో ఒక్కటయ్యారు. అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టారు. ‘మీట్​ ఆన్​ వీల్స్’​ అంటూ నోరూరించే చికెన్​, మటన్​ పచ్చళ్లు, స్నాక్స్​ తయారు చేస్తున్నారు. ఇప్పుడు సిద్దిపేట పచ్చళ్లకి ఫుల్​ డిమాండ్​.

బీడీలు చుట్టి.. కూలీ చేసి..

సిద్దిపేట చుట్టుపక్కల ఏ గ్రామానికి వెళ్లినా అడుగడుగునా అభివృద్ధి కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఆ పల్లెలు సమస్యలతో సావాసం చేసేవి. అధికారుల చొరవ, నాయకుల కృషి, మహిళా సంఘాల సమాఖ్య ఆచరణతో ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్నాయి. ఇర్కోడ్​ విలేజ్​ కూడా ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా ఉండేది. మగవాళ్లంతా కూలీ పనులకు వెళ్తే.. ఆడవాళ్లు బీడీలు చుడుతూ పొట్టనింపుకునేవాళ్లు. ఊళ్లో ఎక్కువ మంది బీడీలను చుట్టడమే ఉపాధిగా చేసుకున్నారు. అవగాహన లేకనో, వేరే మార్గం లేకనో బీడీలు చుట్టేవాళ్లు. దాంతో కొంతమంది దగ్గు, దమ్ముతో బాధపడేవాళ్లు. క్యాన్సర్​ బారిన పడినవాళ్లు కూడా ఉన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలనుకుంది ‘ఇర్కోడ్​ మహిళా సమాఖ్య’. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేయడం నేర్చుకుంది. ఉపాధికి మార్గాలను వెతికింది. మార్పును స్వీకరించడం మొదలుపెట్టింది.

సెర్ప్​​ సాయంతో..

జాతీయ మాంస పరిశోధనా సంస్థ (సెర్ప్​​) గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ‘పచ్చళ్ల తయారీ’ చేసే అవకాశం కల్పించింది. స్థానిక నాయకులు ఈ స్కీమ్​ ఇర్కోడ్​ గ్రామంలో బాగుంటుందని, మహిళలకు అవకాశం ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారనే ఉద్దేశంతో పచ్చళ్ల తయారీలో శిక్షణ ఇవ్వాలనుకున్నారు. ‘‘అప్పటి వరకు కూలీ పనులు చేస్తూ, బీడీలు చుడుతూ బతికేవాళ్లం. చికెన్​, మటన్​ పచ్చళ్లు అంటే ఎవరూ ముందుకు రాలేదు. మేం మాత్రం ముందుకొచ్చాం. ఇరవై మందిని ట్రైనింగ్​కు సెలెక్ట్​ చేశారు. ‘ఆడవాళ్లు మటన్​ కొట్టడం ఏంటీ’ అని ఏవో కారణాలు చెప్పి కొంతమంది తప్పుకున్నారు. చివరకు తొమ్మిది మంది మాత్రమే మిగిలాం. ‘కష్టమైనా సరే పచ్చళ్లు తయారీ చేద్దాం’ అని ఒకొరికొకరం సర్ది చెప్పుకున్నాం. వారం రోజులు హైదరాబాద్​లో ట్రైనింగ్​ తీసుకున్నాం” అని తమ జర్నీ ఎలా మొదలైందో చెప్పారు ‘ఇర్కోడ్​ మహిళా సమాఖ్య’లోని ఒక మెంబర్.

రెండు లక్షల పెట్టుబడితో..

పచ్చళ్లు ఏవిధంగా తయారుచేయాలో నేర్చుకున్నారు. ప్రభుత్వం మెషిన్లు ఇచ్చింది. కానీ సమస్య అంతా పెట్టుబడితోనే. మందాడి చందన, లావణ్య, లక్ష్మి, లాస్య, పద్మ, మౌనిక, స్వప్న, మంజుల, లక్ష్మి … తొమ్మిది మంది కలిసి రెండు లక్షలకుపైగా పోగు చేసుకున్నారు. ఇర్కోడ్​ గ్రామంలో ఒక భవనంలో పచ్చళ్ల తయారీని మొదలుపెట్టారు. ‘‘మూడు నెలల క్రితమే మా పని మొదలైంది. ఒకరికి కష్టమైతే, మరొకరు సాయం చేస్తరు. కొందరు మటన్​, చికెన్​ క్లీన్​ చేస్తే, ఇంకొందరు అందులోకి కావాల్సిన మసాలాలు, దినుసులు సిద్ధం చేస్తరు.

మరో ముగ్గురు తయారుచేసిన పచ్చళ్లను మార్కెట్​కు తరలించి అమ్ముతరు. ఉదయం పది గంటలకు మొదలయ్యే పని.. ఒక్కోసారి రాత్రి పది గంటలయినా ఒడువదు. ప్రాసెస్​ను మధ్యలో ఆపితే.. పచ్చళ్లు కరాబు అవుతాయి. అందుకే పని అయ్యాకే ఇంటికి వెళ్తాం’ అన్నది సమాఖ్య సభ్యురాలు మందాడి చందన.

తాజా మాంసంతో…

ఆరోగ్యకరమైన నాటుకోళ్లు, గొర్రెలు, మేకలను హలాల్​ చేయించి వాడతారు. శుచీ, శుభ్రత పాటించి చికెన్​, మటన్​ పచ్చళ్లను తయారుచేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్గానిక్​ మీట్​ను పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. ‘మేక, గొర్రె ఆరోగ్యమైందా కాదా?’… అని వెటర్నరీ డాక్టర్​తో టెస్ట్​ చేయిస్తారు. ఆ తర్వాతనే పనిలోకి దిగుతారు. వారానికి ఎన్ని పచ్చళ్లు తయారుచేశారు? ఎంత మార్కెట్​ అయిందో రికార్డ్​ చేసుకుంటారు.

మీట్​ ఆన్​​ వీల్స్​

చికెన్​, మటన్​ పచ్చళ్లు తయారుచేసే వాళ్లు తెలంగాణలో తక్కువ. నాన్​వెజ్​ పచ్చళ్లు అనగానే చాలామంది ఇష్టం ​చూపుతున్నారు. ‘మీట్​ ఆన్​​ వీల్స్​’తో జనాల దగ్గరికే వెళ్తున్నారు. తాజా చికెన్, మటన్​తో అక్కడికక్కడే స్నాక్స్​ చేసిస్తారు. కొద్ది రోజుల్లోనే ‘మీట్​ ఆన్​ వీల్స్​’కు మంచి రెస్పాన్స్​ వచ్చింది. చికెన్​, మటన్​ పచ్చళ్లతో పాటు చికెన్​ పకోడి, సమోసా, వింగ్స్ తయారుచేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో జనం ఉండే దగ్గరకు వెళ్తూ.. నోరూరించే పచ్చళ్లు, స్నాక్స్​ అమ్ముతున్నారు.

నాన్​ వెజ్​ పచ్చళ్ల ధరలు

మటన్ పచ్చడి (230 గ్రా)          – రూ.300

చికెన్ పచ్చడి (230 గ్రా)            – రూ.240

మీట్ బాల్స్                            – రూ.80

స్నాక్స్​..

చికెన్ నగ్గెట్స్                          – రూ.80

చికెన్ సమోసా                        – రూ.80

చికెన్ పకోడి                           – రూ.80

చికెన్ వింగ్స్                           – రూ.100

అటు ఇల్లు, ఇటు పచ్చళ్ల తయారీ

మేమంతా మధ్య తరగతివాళ్లం. ఇంటి పనులు చేసుకుంటూనే.. పచ్చళ్లు తయారు చేస్తున్నాం. పనిని పంచుకుంటూ పచ్చళ్లు తయారు చేస్తున్నాం. కొంతమంది ఈ పని చేయడానికి ముందుకు రాలే. అవమానించారు. అయినా మేం మాత్రం విడిచిపెట్టలే. ముందుముందు ఆర్డర్లు పెరిగితే మరిన్ని లాభాలు వస్తాయి.

– మందాడి చందన