కాఫీ ఆర్డర్ చేస్తే... చికెన్ ముక్క వచ్చింది

వంట చేసుకోవడానికి తీరిక లేకపోవడంతో ఈ మధ్య కాలంలో చాలా మంది ఫుడ్ డెలివరీ ఆప్స్ పై ఆధారపడుతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో క్షణం తీరిక లేకుండా గడుపుతూ కాలంతో పాటు దూసుకుపోతున్నారు. దీంతో తీరిగ్గా స్వయంగా ఇంట్లో వండుకొని తినే అలవాటును మరచిపోతున్నారు. వారంలో వచ్చే ఒకటో, రెండో సెలవుల్లోనూ ఇంట్లో వంట చేసుకోవాలా అనే బద్దకంతోనూ కొందరు తమకు కావల్సిన ఫుడ్ కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో కస్టమర్స్ ఆర్డర్ చేసిన ఐటెమ్స్ కి బదులు వేరే ఐటెమ్స్ రావడం, లేదా శుభ్రంగా ఉండకపోవడం, నాణ్యత ఉండకపోవడం చూస్తూనే ఉన్నాం. ఇదే తరహాలో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అరుదైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు.

కాఫీ తాగి, తీరిగ్గా రిలాక్స్ అవుదామని భావించిన ఓ వ్యక్తికి జొమాటో.. ఝలక్ ఇచ్చింది. ఢిల్లీకి చెందిన సుమిత్ అనే వ్యక్తి కాఫీ ఆర్డర్ చేస్తే.. దానితో పాటు అతనికి చికెన్ ముక్క కూడా వచ్చింది. ముందుగా గమనించని అతను, అతని భార్య ఆ కాఫీని తాగేశారు. ఆ తర్వాత కాఫీ కప్పులో ఉన్న చికెన్ ముక్కను చూసి షాకవ్వడం వారి వంతైంది. వెంటనే తమకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని తెలియజేస్తూ.. సుమిత్ తన ట్విట్టర్ అకౌంట్లో ఫొటోలను షేర్ చేశాడు.

ఇదే స్క్రీన్ షాట్ ను జొమాటోకు కూడా షేర్ చేయడంతో... జరిగిన పొరపాటుకు చింతిస్తూ క్షమాపణలు కోరింది. అంతే కాదు ఈ తప్పిదానికి విచారం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తికి ప్రో మెంబర్ షిప్ ను అందిస్తామని ఆఫర్ కూడా ఇచ్చింది. అతని వివరాలను షేర్ చేయమని కోరింది. వీలైనంత త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాం అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ లను కూడా సుమిత్ పోస్ట్ చేశాడు. 

నవరాత్రుల సమయంలోనూ తాము వెజ్ బిర్యానీని ఆర్డర్ చేశామన్న సుమిత్.. పూర్తిగా శాఖాహారులైన తమకు వెజ్ బిర్యానీకి బదులుగా చికెన్ బిర్యానీ పంపారని వాపోయారు. అప్పుడు కూడా అదే సాకు చెప్పారు. కానీ వారు ఏమీ చేయలేదు. అది రెస్టారెంట్ తప్పు అని తెలియజేస్తూ మరొక ట్వీట్ చేశారు సుమిత్. ట్విట్టర్ లో చేసిన అతని పోస్ట్ కు స్పందించిన పలువురు నెటిజన్లు, ఫుట్ డెలివరీ సంస్థ జొమాటోపై మండిపడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం...

మహారాష్ట్రలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

చెట్టు మీద పండ్లను ఇలా కోయచ్చా..! ఫిదా అయిన మహీంద్రా