షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఏలికట్ట గ్రామంలో ఓ వ్యక్తి చికెన్ తింటుండగా గొంతులో ముక్క ఇరుక్కొని చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. జార్కండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారి కొంతకాలంగా ఎలికట్టలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ దగ్గరలోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి చికెన్ తెచ్చుకుని వండుకున్నారు. పూరీలు చేసుకొని మద్యం తాగుతూ భోజనం చేస్తుండగా, జితేంద్రకుమార్ ఒక్కసారిగా కిందపడి గిలగిల కొట్టుకున్నాడు.
ధర్మేందర్, పక్కన ఉంటున్న వారు పరిశీలించగా చనిపోయి ఉన్నాడు. పోలీసులకు చెప్పడంతో వారు క్లూస్టీమ్ను తీసుకువచ్చి పరిశీలించారు. తర్వాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం షాద్ నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ డాక్టర్లు చెక్ చేయగా గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ఉంది. చికెన్ ముక్క ఇరుక్కోవడం వల్లే ఊపిరాడక చనిపోయాడని ప్రకటించారు.