- రెండు రోజుల్లో రూ.350కి చేరుతుందనే అంచనా
- బర్డ్ ఫ్లూ, ఎండలే కారణం అంటున్న వ్యాపారులు
మహబూబ్‌నగర్, వెలుగు: చికెన్ రేట్లు పెరుగుతున్నాయ్. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో కిలో చికెన్ రూ. 300కు చేరువైంది. గత వారంతో పోలిస్తే కిలోపై దాదాపు రూ.70 నుంచి రూ.80 వరకు పెరిగింది. గత వారం లైవ్ బర్డ్ రేట్ కిలోకుగరిష్ఠంగా రూ.118 ఉంటే, ఆదివారం రూ.141కి చేరింది. దీంతో వ్యాపారులు చికెన్ రేట్లు పెంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కిలో చికెన్‌కు రూ.280 నుంచి రూ.290 దాకా తీసుకున్నారు. ఈ రేట్లు ఇలాగే పెరిగితే వచ్చే ఆదివారం నాటికి కిలో చికెన్ ధరలు రూ.330 నుంచి రూ.350 వరకు చేరవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
ఎండల ఎఫెక్ట్..
వాతావరణంలో వస్తున్న మార్పులు ఫౌల్ర్టీ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఏటా మహాశివ రాత్రి వరకు చలి ఎక్కువగా ఉండి, మార్చి రెండోవారం నుంచి ఎండలు తీవ్రమయ్యేవి. దీని వల్ల కోళ్లు చనిపోయి, మార్చి 20 తర్వాత డిమాండ్‌తో పాటు రేట్లు పెరిగేవి. కానీ ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం ఫారాల్లో జనవరిలో దిగుమతి చేసుకున్న కోడిపిల్లలే అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కోడిపిల్లలు దింపుకోవాలని ఫౌల్ర్టీల వద్దకు కంపెనీలు వస్తుంటే రైతులు తిప్పి పంపిస్తున్నారు.
ఈ సారి ఎండలు ఎక్కువగా కాస్తాయని, దాని వల్ల నష్టాలు వస్తాయని చాలా మంది రైతులు కోళ్ల పెంపకానికి ముందుకు రావడం లేదు. మరోవైపు పలు జిల్లాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎండలు ముదిరితే షెడ్లపై నీళ్ల పిచికారీ తప్పనిసరి. గ్రౌండ్‌వాటర్ అడుగంటితే కోళ్లను కాపాడుకోవడం కూడా కష్టమవుతుందని రైతులు అంటున్నారు.
వెంటాడుతున్న బర్డ్ ఫ్లూ భయం..
ఏపీలో ఇటీవల బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడుతున్నాయి. కొద్ది రోజుల కింద నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ఏరియాల్లో పెద్దసంఖ్యలో కోళ్లు బర్డ్‌ఫ్లూతో చనిపోయాయి. దీంతో అక్కడి ఫౌల్ర్టీ రంగం నష్టపోయింది. కోళ్లు అందుబాటులో లేకపోవడంతో అక్కడి వ్యాపారులు తెలంగాణ నుంచి కోళ్లకు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, హైదరాబాద్,శంషాబాద్ ప్రాంతాల్లో ఉన్న ఫారాల నుంచి కర్ణాటకలోని రాయచూర్,గుల్బర్గా ప్రాంతాలకు, ఏపీలోని కర్నూల్, నంద్యాల, అనంతపురం, కడప ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల సమ్మక్క జాతర సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీగా కోళ్ల అమ్మకాలు జరిగాయి. ఇది కూడా కోళ్ల కొరతకు, తద్వారా రేట్ల పెరుగుదలకు కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు.
గిరాకీ బాగా తగ్గింది..
ఆదివారం వచ్చిందంటే చికెన్ మస్తు అమ్ముడుపోయేది. మా షాపులో దాదాపు 80 నుంచి 90 కోళ్ల అమ్ముడయ్యేది. కానీ రేట్ పెరగడంతో గిరాకీ బాగా తగ్గింది. కిలో తీసుకుపోయేటోళ్లు అర కిలో తీసుకుంటున్నారు.
- ఎండీ ఉస్మాన్, చికెన్ సెంటర్ నిర్వాహకుడు, బికే రెడ్డి కాలనీ, పాలమూరు
వచ్చేవారం రూ.350కి చేరుతది..
ఈసారి చికెన్ రేట్లు బాగా పెరుగుతాయి. వారం రోజుల నుంచి లైవ్ బర్డ్‌పై రూ.2 నుంచి రూ.4 వరకు పెంచుతూ వస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో రూ.300 దాటుతది. వారంలో రూ.350 వరకు చేరే చాన్స్ ఉంది.
- మహబూబ్ అలీ, చికెన్‌సెంటర్ నిర్వాహకుడు, మక్తల్
గ్రౌండ్ వాటర్ తగ్గింది..
నేను జనవరిలో కంపెనీ నుంచి కోళ్లను తీసుకొని పెంచిన. ఇప్పుడు మళ్లీ తీసుకోవాలి. కానీ, నా షెడ్లో ఉన్న బోరులో నీళ్లు వస్తలేవు. కొత్త బోర్లు వేస్తే నీళ్లు వస్తయో లేదో కూడా తెల్వదు. ఎండలు ముదిరితే షెడ్లపైనా, లోపల నీళ్లు పిచికారీ చేయాలి. లేకుంటే చనిపోతాయి. ఆ భయంతో ఈసారి కోడిపిల్లలను తీసుకుంటలేను.
- ప్రసాద్, ఫౌల్ర్టీ రైతు, దుప్పల్లి