![కిలో చికెన్ @ రూ.300](https://static.v6velugu.com/uploads/2021/04/chicken-rates-hit-all-time-high-in-telangana_XIymO2B8eE.jpg)
- డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేక మండిపోతున్న రేట్లు
- బర్డ్ ఫ్లూ భయంతో గత డిసెంబర్ నుంచి తగ్గిన పెంపకం
- ఎండాకాలం కావడంతో మరింత తగ్గిన ఉత్పత్తి
పదేండ్లుగా సమ్మర్లో పెరుగుతున్నయ్
చికెన్ ధరలు పౌల్ట్రీ ఫామ్ రైతుల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాక ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చికెన్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. సమ్మర్లో బర్డ్ షార్టేజ్ సృష్టించి రేట్లు పెంచుతున్నారని అంటున్నారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చికెన్ రేట్లు మండిపోతున్నాయి. ప్రస్తుతం కొన్ని చోట్ల కిలో చికెన్ రూ. 300 వరకు పలుకుతోంది. బోన్ లెస్ అయితే రూ. 500 దాటింది. బర్డ్ ఫ్లూ భయంతో డిసెంబర్ నుంచి కోళ్ల పెంపకాన్ని తగ్గించడం, ఇప్పుడు డిమాండ్ పెరిగి అందుకు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. పైగా ఎప్పటిలానే ఎండాకాలంలో ఉత్పత్తి తగ్గడంతో రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.
బోన్ లెస్ రూ. 520
గత డిసెంబర్ వరకు చికెన్ కిలో రూ.200 నుంచి రూ. 250 వరకు పలికింది. తర్వాత బర్డ్ఫ్లూ ప్రభావంతో పరిస్థితి మారిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ. 150కి దిగొచ్చింది. ఆ తర్వాత రేటు మళ్లీ పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఏకంగా రూ. 300కు దగ్గరైంది. బుధవారం కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 280 పలికింది. లైవ్ బర్డ్ను కిలో రూ. 170 వరకు అమ్మారు. ఈ నాలుగైదు రోజుల్లోనే చికెన్ రేటు రూ. 240 నుంచి రూ. 280కి పెరిగింది. ఆదివారం నాటికి రేటు రూ. 300 దాటుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
కరోనాతో నిరుడు తగ్గి..
కరోనా వల్ల గత మార్చి, ఏప్రిల్ నెలల్లో చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి. ప్రజలు తినడం తగ్గించారు. దీంతో చికెన్ తినాలని ప్రభుత్వం, ఫౌల్ట్రీ యజమానులు ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మెల్లగా రేట్లు పెరుగుతూ వచ్చాయి. ఫామ్ గేట్లో గత మార్చి7న కోడి కిలో రూ. 37 పలుకగా ఏప్రిల్ 7న రూ. 80కు చేరింది. ప్రస్తుతం రూ. 142 పలుకుతోంది.
సమ్మర్లో చికెన్ ప్రొడక్షన్ తక్కువ
సాధారణంగా చలికాలంలో కోళ్లు వేగంగా ఎదుగుతాయి. ఈ డిసెంబర్, జనవరి నెలల్లో ఒక కోడి పిల్ల కిలోన్నర ఎదగడానికి 39 నుంచి 40 రోజులు పట్టింది. అయితే ఈ మార్చి నెల నుంచే ఎండలు బాగా పెరగడంతో పిల్లలు ఎదగడానికి 45 నుంచి 60 రోజుల వరకు పడుతోందని, అందుకే బాయిలర్ కోళ్ల ప్రొడక్షన్ తగ్గుతోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నీరు లేక కోళ్ల పెంపకాన్ని కొందరు బాగా తగ్గించారు. దీంతో ప్రొడక్షన్ తగ్గి ధరలపై ప్రభావం పడుతోంది.
వేడికి ప్రొడక్షన్ తగ్గుతోంది
సమ్మర్లో టెంపరేచర్ పెరిగి కోళ్లలో పెరుగుదల తగ్గుతుంది. మామూలుగా 40 రోజుల్లో కోళ్లు కిలోన్నర వరకు పెరుగుతాయి. ఎండాకాలంలో ఎక్కువ నీళ్లు తాగుతూ ఫీడ్ తినవు. ఎదుగుదల తగ్గుతుంది. దీంతో వాటి ఎదుగుదలకు 10, 15 రోజులు ఎక్కువ టైమ్ పడుతుంది. వేడికి కోళ్లు చనిపోతుండటంతో చిన్న రైతులు నష్టాలు భరించలేకపోతున్నారు. వాటర్ ఫెసిలిటీ లేక చిన్న రైతులు కోళ్ల ఫామ్లను నడపలేకపోతున్నరు. షార్టేజీతో ధరలు పెరుగుతున్నయ్. -ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు.