
- వైరస్ ప్రచారంతో పౌల్ట్రీ షెడ్ల క్లీనింగ్ పై స్పెషల్ ఫోకస్
- కోడి పిల్లల పెంపకం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న కంపెనీలు, రైతులు
- ఇంకా పుంజుకోని చికెన్ అమ్మకాలు
గద్వాల, వెలుగు: పౌల్ట్రీ రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రచారంతో చికెన్ అమ్మకాలు తగ్గాయి. మార్కెటింగ్ లేకపోవటంతో షెడ్లలో మిగిలిన కోళ్లను అమ్మేందుకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. మళ్లీ కొత్తగా కోడి పిల్లలు దింపుకోవాలా..? వద్దా..? అనే సందిగ్ధంలో రైతులున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో 300 మందికి పైగా పౌల్ట్రీ రైతులు ఉన్నారు. దాదాపు 20 లక్షల కోడి పిల్లల పెంపకం జరుగుతున్నది. గద్వాల, వనపర్తి జిల్లాలో మొత్తం దాదాపు 600 మంది రైతుల వద్ద 40 లక్షలకు పైగా కోడి పిల్లల పెంపకం ఉందని వివిధ కంపెనీల రికార్డులు చెబుతున్నాయి. ఒక్కసారిగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందనే ప్రచారంతో కోళ్ల పెంపకం రైతులతో పాటు , చికెన్ సెంటర్ల ఓనర్లు, ట్రేడర్స్, రవాణ వెహికల్స్ అందులో పని చేసే వారి జీవనోపాధిపై భారీ ఎఫెక్ట్ పడుతోంది.
షెడ్ల క్లీనింగ్ పై దృష్టి
బర్డ్ ఫ్లూ రూమర్ తో రైతులు, కంపెనీల ఓనర్లు అలర్ట్ అయ్యారు. షెడ్ల క్లీనింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్యాస్ బుడర్లతో షెడ్డు మొత్తాన్ని వేడి చేసి వైరస్ వ్యాప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా సున్నం, బ్లీచింగ్ పౌడర్, ఫార్మోలిన్ తదితర వాటిని షెడ్డు మొత్తం చల్లి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ బ్యాచ్ కు క్లినిక్ తప్పకుండా చేస్తారు, కానీ ఈసారి మాత్రం స్పెషల్ డ్రైవ్ మాదిరిగా షెడ్ల క్లీనింగ్ చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఎండాకాలం కావడంతో 40 డిగ్రీల వేడి ఉంటుందని ఈ వాతావరణంలో ఎట్టి పరిస్థితుల్లో వైరస్ అనేది ఉండదని అధికారులు చెబుతున్నారు.
ఆందోళనలో పౌల్ట్రీ రైతులు
జోగులాంబ గద్వాల జిల్లాలో వైరస్ వ్యాప్తి లేకున్నప్పటికీ చికెన్ అమ్మకాలు తగ్గాయి. గద్వాల, వనపర్తి రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 600 మంది రైతులు 40 లక్షల కోళ్లను పెంచుతున్నారు. జిల్లాలో రెండు వేలకు పైగా చికెన్ సెంటర్లు ఉన్నాయి. వాటికి కూడా గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నారు. పౌల్ట్రీ కరెంట్ బిల్లుల్లు కట్టలేక, లేబర్ జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది వ్యవసాయం చేసుకుంటూనే అదనపు ఆదాయం కోసం రైతులు సొంతంగా పౌల్ట్రీ షెడ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమ వ్యవసాయ పొలాల దగ్గరే ఒక్కొక్క రైతు స్తోమతను బట్టి 5000 నుంచి 20వేల కోడి పిల్లల షెడ్లను నిర్వహిస్తున్నారు. ఖర్చులు పోను ఒక్కొక్క బ్యాచ్ కు లాభసాటి ఆదాయం సమకూరుతుంది. కానీ, ఈ సారి బర్ల్ ఫ్లూ ప్రచారంతో రైతుల ఆదాయంపై తీవ్ర ఎఫెక్ట్ చూపిస్తోంది.
ఇంకా పుంజుకొని చికెన్ అమ్మకాలు
జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఇంకా చికెన్ అమ్మకాలు పుంజుకోలేదు. గతంలో ఒక్కొక్క చికెన్ సెంటర్ లో పది నుంచి 200 కోళ్లు అమ్మే వారు. కానీ, ఇప్పుడు 20 కోళ్లు కూడా అమ్మలేని పరిస్థితి ఉన్నది. చికెన్ మేళాలు పెట్టినప్పుడు 300 కేజీల చికెన్ గంటలో అయిపోతున్నదని, కానీ డబ్బులు పెట్టి చికెన్ కొనుగోలు చేసేందుకు మాత్రం ఇంకా జనాలు జంకుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వారంలోనే చికెన్ అమ్మకాలలో కొంత పురోగతి కనిపిస్తుందని చికెన్ సెంటర్ ఓనర్లు చెబుతున్నారు.
జిల్లాలో ఏ వైరస్ లేదు
మన జిల్లాలో ఏ వైరస్ లేదు. శుభ్రంగా చికెన్ ను తినొచ్చు. బర్డ్ ఫ్లూ అనే వైరస్ అసలే లేదు. వేరేచోట వచ్చినా.. ఆ లక్షణాలు కలిగిన వ్యాధి తప్ప బర్డ్ ఫ్లూ కాదు. బర్డ్ ఫ్లూ భయం అనేది ఫోబియా మాత్రమే. ప్రజలకు అవగాహన కోసం చికెన్ మేళాలు కూడా నిర్వహిస్తున్నాం.
వెంకటేశ్వర్లు జిల్లా వెటర్నరీ ఆఫీసర్ , గద్వాల.
వైరస్ ఉన్న కోడి చికెన్ సెంటర్ కు రాదు..
ఏదైనా వైరస్ ఉన్న కోడి చికెన్ సెంటర్ వరకు రాదు. డిసీజ్ వచ్చిన కోడి ఫౌల్ట్రీలో అక్కడి నుంచి అక్కడే చనిపోతుంది. ఆరోగ్యంగా ఉన్న కోడి మాత్రమే చికెన్ సెంటర్ కు వస్తుంది. ఇప్పుడిప్పుడే గిరాకీలు కూడా పెరుగుతున్నాయి.
మజీద్ చికెన్ సెంటర్ నిర్వాకుడు