
రెండు తెలుగు రాష్ట్రాల చికెన్ ప్రియులను బర్డ్ ఫ్లూ వణికించింది. బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందడంతో చికెన్ తినాలంటేనే జనం జంకారు. చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగని వారు కూడా బర్డ్ ఫ్లూ భయానికి చికెన్ షాపుల వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ షాపులపై భారీగా పడింది. ఫ్లూ వ్యాప్తిస్తోందన్న భయంతో చికెన్ తినేందుకు జనం ఆసక్తి చూపకపోవడంతో చికెన్ బిజినెస్ పూర్తిగా డల్ అయిపోయింది. చికెన్ ధరలు తగ్గిన కూడా జనం తినేందుకు ఆసక్తి చూపలేదు. ఆదివారం వస్తే చాలు జాతరను తలపించే చికెన్ షాపులు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో బోసిపోయాయి.
ALSO READ | కిచెన్ తెలంగాణ : సండే స్పెషల్.. దోసకాయతో అదిరిపోయే రుచులు!
దాదాపు రెండు వారాలు ఇదే పరిస్థితి కనిపించింది. జనం లేక చికెన్ షాపులు వెలవెలబోయాయి. అయితే.. ఈ సండే మాత్రం పరిస్థితి కొంత మారింది. ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయం వీడటంతో చికెన్ షాపులకు మళ్లీ కళ వచ్చింది. ఆదివారం పూట కస్టమర్లతో కిటకిటలాడాయి చికెన్ సెంటర్లు. దాదాపుగా రెండు, మూడు వారాలు చికెన్‌కు దూరంగా ఉన్న మాంసం ప్రియులు బర్డ్ ఫ్లూ భయాందోళనలు తగ్గుముఖం పట్టడంతో చికెన్ షాపుల వైపు పరుగులు పెట్టారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈ దృశ్యాలు కనిపించాయి. బర్డ్ ఫ్లూ భయం వీడటంతో జనం ఆదివారం చికెన్ తినేందుకు ఆసక్తి చూపారు. చికెన్ కోసం జనం క్యూ కట్టడంతో ఆదివారం షాపుల వద్ద రద్దీ నెలకొంది. దీంతో సిటీలో చికెన్ అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. దాదాపు నెల రోజుల పాటు బోసిపోయిన చికెన్ సెంటర్లకు సండే రోజు కస్టమర్లు క్యూ కట్టడంతో చికెన్ అమ్మకాలు పెరిగాయి.
జనం చికెన్ తినేందుకు ఆసక్తి చూపడంతో గత రెండు, మూడు వారాలతో పోలిస్తే ఈ సండే చికెన్ ధరలు కాస్త పెరిగాయి. బర్డ్ ఫ్లూ భయాందోళనలు వీడి జనం మళ్లీ చికెన్ తినేందుకు ఆసక్తి చూపిస్తూ షాపులకు రావడంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా పడిపోయిన చికెన్ ధరలు కాస్త పెరిగాయి. హైదరాబాద్లో కిలో చికెన్ రూ.200కు పైనే ఉంది.