![హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: కిలో రూ. 150.. అయినా కొనేటోళ్లే లేరు ..](https://static.v6velugu.com/uploads/2025/02/chicken-sales-in-hyderabad-falls-50-percent-due-to-bird-flu_R1KIcMaf9L.jpg)
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కోళ్లు, కోడిగుడ్ల సరఫరాపై ఆంక్షలు విధించాయి. ఇదిలా ఉండగా బర్డ్ ఫ్లూ వైరస్ హైదరాబాద్ లో చికెన్ సెంటర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ ఎఫెక్ట్ తో కిలో చికెన్ ధర రూ. 150 కి పడిపోయినా కూడా కొనడానికి ఎవరు ఆసక్తి చూపట్లేదు.. దీంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ లో రోజుకు 6లక్షల కిలోలుగా ఉండే చికెన్ అమ్మకాలు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో సుమారు 50శాతానికి పడిపోయాయనట్లు తెలుస్తోంది. చికెన్ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
బార్డర్ జిల్లాల్లో టెన్షన్:
ఇదిలా ఉండగా.. ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో సరిహద్దు జిల్లాల్లో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏపీని ఆనుకొని ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ పశు సంవర్థక శాఖ సిబ్బందిని నియమించారు. వాహనాలను తనిఖీ చేసిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ప్రత్యేకించి కోళ్లు, కోడి గుడ్లు, కోళ్ల దాణా ఏపీ నుంచి మన రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కోళ్లు, గుడ్లు, దాణాతో ఏవైనా వాహనాలు వస్తే వాటిని తిప్పి పంపిస్తున్నారు.
ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం వేల్పూరు, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అక్కడి కోళ్ల నుంచి తీసుకున్న శాంపిల్స్‌లో ఏవీఎన్ ఇన్ ఫ్లుయెంజా(హెచ్5ఎన్1-బర్డ్ ఫ్లూ) ఉందని నిర్ధారించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులు ఆనుకొని ఉండడంతో ఇక్కడి అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో కోదాడ రామాపురం దగ్గర, నల్గొండ జిల్లాలో తిరుమలగిరి సాగర్, వాడపల్లి వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
బర్డ్ ఫ్లూ కట్టడికి చర్యలు:
ఏపీలో బర్డ్ ఫ్లూ కేసుల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉన్నామని.. కోళ్లు, ఎగ్స్, దాణా రాష్ట్రంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు అధికారులు. బార్డర్ మండలాల్లో ఉన్న కోళ్ల ఫామ్ లను ఇప్పటికే విజిట్ చేసి, తగు సూచనలు ఇచ్చామని... ఏపీ బార్డర్‌కు 10 కిలోమీటర్ల పరధిలోని ఫామ్‌లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. ఫామ్‌లోకి వెళ్లే సమయంలో తప్పకుండా మాస్క్ ధరించాలని ఓనర్లకు సూచించామని అన్నారు అధికారులు.