- క్యాట్ ఫిష్, పందులకు ఆహారంగా చికెన్ వ్యర్థాలు
- సేకరణ టెండర్ కుపోటాపోటీ
- రూ.లక్షల్లో గుడ్విల్ ఇస్తామంటున్న కాంట్రాక్టర్లు
వనపర్తి, వెలుగు: కోళ్ల వ్యర్థాలను అమ్ముకుంటే రూ.లక్షలు కాదు.. రూ.కోటి వరకు సంపాదించవచ్చని కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. పట్టణాల్లోని చికెన్ సెంటర్ల నుంచి వ్యర్థాలను సేకరించి దూరంగా పారేయడానికి టెండర్దారులు పోటీ పడుతుండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. చికెన్ వేస్టేజీని పందులు, క్యాట్ఫిష్కు ఆహారంగా వినియోగించడమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. టెండర్ తమకే దక్కేలా చూస్తే రూ.లక్షల్లో ముట్టచెబుతామని మున్సిపల్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు.
రెండేండ్లుగా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మున్సిపాలిటీలోని ప్రధాన ప్రజాప్రతినిధికి రూ.10 నుంచి రూ.15 లక్షల దాకా గుడ్విల్ ఇచ్చినట్లు తాజాగా బయటపడింది. ఈసారి పాలకవర్గం మారడంతో టెండర్ రెన్యూవల్ చేయించినా, టెండర్ తమకే దక్కేలా చూసినా రూ.18 లక్షల వరకు గుడ్విల్ ఇస్తామంటూ ఆఫర్ పెడుతున్నారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు అంగీకరించకపోవడంతో, ఎవరితో సిఫారసు చేయిస్తే పని అవుతుందోననే ఉద్దేశంతో పాలక పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలాఉంటే రూ.25లక్షలు ఇస్తే పని అవుతుందని కొందరు బేరం పెట్టినట్లు సమాచారం.
ఈ సారే పోటీ ఎందుకు?
కొన్నేండ్లుగా చికెన్ వ్యర్థాలను సేకరించి బయట పారబోస్తున్నారనే అనుకుంటున్నారు. కాని చికెన్ వ్యర్థాలను సేకరించేందుకు పోటీ పడడమే కాకుండా, రూ.లక్షల్లో గుడ్విల్ ఇవ్వడానికీ పోటీ పడుతుండడంతో అసలు చికెన్ వేస్టేజీని ఏం చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క వనపర్తి జిల్లా కేంద్రంలోని చికెన్ సెంటర్ల నుంచి సేకరించిన టన్నుల కొద్దీ చికెన్ వేస్టేజీతో కాంట్రాక్టర్కు కాసుల పంట పండుతోంది. అందుకోసమే గుడ్విల్ కింద రూ.25లక్షలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక్క వనపర్తిలోనే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీల్లో ఇదే తంతు నడుస్తోంది. తాజాగా షాద్నగర్ మున్సిపాలిటీలో చికెన్ వ్యర్థాల టెండర్ దక్కించుకునేందుకు పైరవీలు చేస్తుండగా, ఎమ్మెల్యే జోక్యం చేసుకొని టెండర్ పారదర్శకంగా నిర్వహించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
క్యాట్ ఫిష్, పందులకు మెయిన్ ఫుడ్..
చికెన్ వేస్టేజీని సేకరించిన కాంట్రాక్టర్లు వాటిని క్యాట్ ఫిష్ పెంచే వ్యాపారులకు అమ్ముతుండడంతో వేస్టేజీకి డిమాండ్ పెరిగింది. క్యాట్ ఫిష్లకే కాకుండా పందులకూ ఆహారంగా వీటిని వేస్తున్నారు. పందుల పెంపకందారులు కూడా చికెన్ వేస్టేజీని గతంలో నేరుగా చికెన్ సెంటర్ల నుంచి తీసుకెళ్లేవారు. వేస్టేజీకి డిమాండ్ పెరగడంతో వారికి దొరకడం లేదు. దీంతో కాంట్రాక్టర్ల నుంచే కొనాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలో రోజూ నాలుగు బొలేరో వాహనాల చికెన్ వేస్టేజీని సేకరిస్తున్నారు. అంటే దాదాపు 15 మెట్రిక్ టన్నుల వేస్టేజీని సేకరిస్తున్నారన్న మాట.
జిల్లాలో క్యాట్ ఫిష్ పెంపకం లేదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నా, పక్కనే ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాలో క్యాట్ ఫిష్ పెంచుతున్నట్లు తెలిసింది. చికెన్ వేస్టేజీని ముందుగా గిర్నీలాంటి యంత్రంలో వేసి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి సప్లై చేస్తున్నారు. మామూలు దాణా కంటే ఈ వేస్టేజీ తింటే చేపలు త్వరగా బరువు పెరుగుతాయి. దీంతో గిట్టుబాటవుతుందని వ్యాపారులు ఈ వేస్టేజీపై దృష్టి పెడుతున్నారు. ఇక చికెన్ వేస్టేజీని వేరే చేపలకు వేస్తున్నారన్న విషయాన్ని మత్స్యశాఖ అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఒక్క క్యాట్ ఫిష్ మినహా మిగతా ఏ చేపలు ఈ వేస్టేజీని తినవని అంటున్నారు. ఫంగషియా జాతికి చెందిన చేపలు తింటాయని వారు చెబుతున్నారు. ఇదిలాఉంటే చేపల చెరువుల వద్ద చికెన్ వేస్టేజీ వేయడంతో పక్కనే దుర్వాసన వస్తోందని, దీంతో తాము రోగాల బారిన పడుతున్నామని రైతులు వాపోతున్నారు.
పారదర్శకంగా టెండర్లు..
చికెన్ వేస్టేజీ సేకరణకు సంబంధించి ఈ నెల 12న టెండర్ వేస్తున్నాం. టెండర్లు పారదర్శకంగా నిర్వహిస్తాం. గుడ్విల్, పైరవీలకు తావు లేకుండా చూస్తాం.
పూర్ణచందర్, మున్సిపల్ కమిషనర్, వనపర్తి