- కృష్ణానది తీర ప్రాంతాల్లో అక్రమ దందా
- ఆ చేపలతో మనుషులు, పర్యావరణానికి, నదీ జలాలకు ముప్పు
గద్వాల, వెలుగు : చికెన్ వ్యర్థాలను వినియోగించి చేపలను పెంచడం ఆందోళన కలిగిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లోని చేపల చెరువుల్లో క్యాట్‌ఫిష్, ఫంగస్ చేపలను పెంచుతుండగా, వాటికి ఆహారంగా చికెన్ వ్యర్థాలను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు వృథాగా పారవేసే చికెన్ వ్యర్థాలతో పాటు కుళ్లిపోయిన కోడిగుడ్లు చేపలకు ఆహారంగా వేస్తున్నారు.
గద్వాల జిల్లాలో చికెన్ వ్యర్థాలతో ఏటా రూ.50 లక్షల బిజినెస్ నడుస్తోందంటే, చేపల పెంపకంలో వీటి వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చేపలు తింటే మనుషులకు రోగాలు వస్తాయని, అదేవిధంగా పర్యావరణానికి హాని కలుగుతుందని, నదీ జలాలు కూడా కలుషితం అవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
50 లక్షలకు పైగా బిజినెస్..
జిల్లాలో చికెన్ వ్యర్థాలకు డిమాండ్ ఉండడంతో ఈ బిజినెస్ పై చాలామంది ఫోకస్ పెడుతున్నారు. గద్వాల పట్టణంలో 80 వరకు చికెన్ సెంటర్లు ఉంటాయి. ప్రతి చికెన్ సెంటర్ కు ముందుగానే రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు అడ్వాన్స్ ఇచ్చారని చికెన్ సెంటర్ ఓనర్లు చెబుతున్నారు. ప్రతిరోజు బొలెరో వెహికల్ వచ్చి చికెన్ వ్యర్థాలు(కాళ్లు, మెడకాయ, తలకాయ, పేగులు) తీసుకెళ్తున్నారు.
ప్రతిరోజు అన్ని చికెన్ సెంటర్లు కలిపి 2 నుంచి 3 టన్నులు, ఆదివారం అయితే 5 నుంచి 6 టన్నుల వ్యర్థాలు తీసుకెళ్తారు. వీటితో పాటు జిల్లాలో మరో 180 చికెన్ సెంటర్లు ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా వ్యర్థాలు తీసుకెళ్తున్నారు. చికెన్ సెంటర్ల వద్ద కిలోకు రూ.6 నుంచి రూ.8 కొనుగోలు చేసి, రూ.15 కు అమ్ముతున్నట్లు సమాచారం.
నదీ తీర ప్రాంతాల్లో చేపల చెరువులు..
కృష్ణానది తీర ప్రాంతమైన ధరూర్ మండలంలోని ఉప్పేరు, గార్లపాడు, ఖమ్మంపాడు, గద్వాల మండలం లత్తిపురం, బీరెల్లి, ఇటిక్యాల మండలం షేక్ పల్లె, తిమ్మాపురం తదితర గ్రామాల్లో క్యాట్ ఫిష్, ఫంగస్ చేపల చెరువులున్నాయి. ఏపీలోని కృష్ణా, నెల్లూరు ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి రైతుల వ్యవసాయ పొలాలను లీజుకు తీసుకొని ఫంగస్, క్యాట్ ఫిష్ చేపలను పెంచుతున్నారు.
వీటిని సాధారణంగా దాణా, కూరగాయలతో పెంచాలి. కానీ, సాధారణంగా పెంచితే ఒకే పంట వస్తుందని లాభం కూడా తక్కువ వస్తుండడంతో వాటిని పెంచడం మానేశారు. వాటి స్థానంలో ఫంగస్, క్యాట్ ఫిష్ చేపలను చికెన్ వ్యర్ధాలు, కుళ్లిన గుడ్లను ఉడికించి వేయడంతో ఏడాదిలో రెండు పంటలు వచ్చి మంచి ఆదాయం రావడంతో గత కొంతకాలంగా వీటిని పెంచుతున్నారని అంటున్నారు.
వీటిని తింటే అనారోగ్యమే..
చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపలు తింటే అనారోగ్యం పాలుకాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాట్ ఫిష్ చేపలు తింటే ప్రాణాంతక క్యాన్సర్ గా మారుతుందని గతంలోనే ఈ చేపలను నిషేధించారు. అయినా అక్కడక్కడ గుట్టుచప్పుడు కాకుండా క్యాట్ ఫిష్, ఫంగస్ చేపలను పెంచుతున్నారు. గతంలో ఫంగస్ చేపలను మామూలు పద్ధతిలో పెంచేవారు.
కానీ ఇప్పుడు అవి తొందరగా పెరగాలనే ఉద్దేశంతో వ్యర్థాలను వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని అంటున్నారు. ఇక్కడ పెంచిన చేపలను హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎక్స్ పోర్ట్ చేయడంతో పాటు అప్పుడప్పుడు లోకల్ మార్కెట్లో కూడా అమ్ముతున్నారు.