తెలంగాణ రాష్ట్రంలో ఒకటి లేదా రెండు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించే దిశగా తమ కసరత్తును ముమ్మరం చేస్తోంది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అందరూ కూడా తమ మీద ఉన్న నేరాలకు సంబంధించిన వివరాలను పత్రిక ప్రకటనల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవినీతి, నేరాలు చేస్తోన్న వారే ఎన్నికల్లో నిలబడి గెలిచి అధికారాన్ని చెలాయిస్తూ దేశ సంపదలను పూర్తిగా దోచుకుంటున్నారు.
వీరి వల్ల ప్రజాస్వామ్యం కాలక్రమేణా కనుమరుగవుతూ వస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తోన్న నాయకులు ఎవరైనా సరే వారిపై ఉన్న క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే వాటిని ఉన్నది ఉన్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన విధంగా ప్రజలకు తెలిసేలా బహిర్గతం చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రజలు అన్నీ తెలుసుకుని మంచి అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. లేకపోతే అవినీతి పరులే మళ్లీ గెలిచి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కనుచూపు మేరలో లేకుండా చేసే ప్రమాదముంది.
ALSO READ : కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరో?..తుంగతుర్తిలో ఆశావహుల మధ్య పోటీ
అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్లాస్టిక్ తో తయారు చేసిన జెండాలను, కండువాలను, వస్తువులను వాడకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే తెలిపింది. కావున కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన అన్ని నిబంధనలను కచ్చితంగా అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు పాటించాలి. తప్పుడు అఫిడవిట్లు సమర్పించి, ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు డబ్బు ఆశను చూపించి, వారిని ప్రలోభ పెట్టే విధంగా నగదు, మద్యం పంపిణీ చేసేవారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
- కూరపాటి శ్రావణ్