పోలింగ్, కౌంటింగ్​పై ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నరు : రాజీవ్ కుమార్

పోలింగ్, కౌంటింగ్​పై ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నరు : రాజీవ్ కుమార్
  • రిజల్ట్ అనుకూలంగా రాకపోతే మమ్మల్నే నిందిస్తున్నరు
  • వీడ్కోలు సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కామెంట్స్

న్యూఢిల్లీ: పోలింగ్, కౌంటింగ్ వంటి కీలక సమయాల్లో ప్రజలను తప్పుదారి పట్టించే ధోరణి పెరుగుతున్నదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి ఇష్టపడనివారు అన్యాయంగా ఎలక్షన్ కమిషన్​ను నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాజీవ్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా సోమవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు విమర్శించినంత మాత్రాన ఈసీపై ప్రజలకున్న నమ్మకాన్ని ఎవరూ పోగొట్టలేరు. 

ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి వ్యూహాలను నివారించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్న. ఎన్నికల ప్రక్రియను దగ్గరుండి పూర్తిగా పరిశీలిస్తున్నవారే ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేయడం శోఛనీయం. 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది నిబద్ధతతో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా విధులు నిర్వర్తింస్తుంటారు. అయినా ప్రేరేపిత, ఆధారాలు లేని దాడులు ఈసీపై 75 ఏండ్ల  విశ్వాసాన్ని తగ్గించలేవు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఈవీఎం ట్యాంపరింగ్, ఓటింగ్‌‌లో అవకతవకలు, ఓటుకు నోటు వంటి సందర్భాల్లో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 

దీనిపై మేం చాలాసార్లు స్పష్టత ఇచ్చాం. కానీ పోలింగ్, కౌంటింగ్ వంటి సమయాల్లో మీడియాలో, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఈసీ అధికారులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే ధోరణి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.

ఏది జరిగినా మమ్మల్నే బలిపశువుగా భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యంతరాలను లేవనెత్తకుండా, అప్పీళ్లు దాఖలు చేయకుండా ఆరోపణలు చేయడం దారుణం. మన ఎన్నికల నిర్వహణ విధానం  ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతున్నది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఎన్నికల సంఘం అంకితభావంతో పనిచేస్తున్నది"అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.