పాల్వంచ, వెలుగు : విద్యుత్ కార్మికులను క్రీడారంగంలో అగ్ర భాగాన నిలిపేందుకు టీఎస్జెన్కో ప్రాధాన్యమిస్తోందని కేటీపీఎస్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్లు అన్నారు. మూడురోజులపాటు జరిగిన టీఎస్ జెన్కో క్రీడల ముగింపు సభలో విజేతలకు కేటీపీఎస్ 5,6 దశల సీఈ ఎం. ప్రభాకర రావు, 7వ దశ సీఈ పలుకుర్తి వెంకటేశ్వరరావు, ట్రైనింగ్ సెంటర్ సీఈ శ్రీనివాస బాబు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విధులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో క్రీడలకు కూడా అంతే ఇవ్వాలన్నారు.
క్రీడారంగంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని సూచించారు. క్రీడల ద్వారా రాష్ట్రానికి, దేశానికి పతకాలు తేవాలని, అందుకు నిరంతరం శ్రమించాలని పేర్కొన్నారు. అంతకుముందు వివిధ విభాగాల్లో గెలుపొందిన జట్ల క్రీడాకారులను అభినందించారు. ప్రోగ్రాంలో కేటీపీఎస్ స్పోర్ట్స్ సెక్రటరీలు వై. వెంకటేశ్వర్లు, వీరస్వామి, ఎస్.దుర్గా మల్లేశ్వరి, స్పోర్ట్స్ ఆఫీసర్ లోహితానంద్ తదితరులు పాల్గొన్నారు.