దోమల ఆఫీసర్​ కావలెను: జీహెచ్ఎంసీలో చీఫ్​ ఎంటమాలజిస్ట్ ​పోస్ట్ ​ఖాళీ

దోమల ఆఫీసర్​ కావలెను: జీహెచ్ఎంసీలో చీఫ్​ ఎంటమాలజిస్ట్ ​పోస్ట్ ​ఖాళీ
  • హెల్త్ మినిస్టర్ వద్దకుఆశావహుల క్యూ  
  • మరికొందరు ఉన్నతాధికారుల దగ్గరకు..
  • నియమించాలంటూ హెల్త్ డిపార్టుమెంట్​కు బల్దియా లెటర్
  • దోమలు పెరుగుతుండటంపై మంత్రి పొన్నం ఫైర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో దోమల నివారణకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో కీలకమైన చీఫ్ ఎంటమాలజిస్ట్ (సీఈ) పోస్టుకు మస్త్ డిమాండ్ ఏర్పడింది. మూడు నెలల క్రితం చీఫ్ ఎంటమాలజిస్ట్ గా ఉన్న రాంబాబు పదవీ విరమణ చేశారు. నెల తర్వాత అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ జయంత్ కు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. ఎందుకో నెల తర్వాత ఆయనను బాధ్యతల నుంచి తప్పించారు. 

డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ స్థాయిలో ఉన్న అధికారినే సీఈగా హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ నియమిస్తుంది. అందుకే ఆఫీసర్​ను నియమించాలంటూ బల్దియా హెల్త్ డిపార్టుమెంట్ కు పలు లెటర్లు రాసింది. అయినా ఆ శాఖ ఉన్నతాధికారులు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. ఎంతో మంది అర్హులైన ఆఫీసర్లు ఉన్నా పోస్టు భర్తీ చేయడంలో అలసత్వం వహిస్తున్నది. మరోవైపు ఈ పోస్టు ఖాళీగా ఉందని తెలుసుకున్న పలువురు ఆఫీసర్లు తమకే ఇప్పించాలంటూ హెల్త్ మినిస్టర్ దగ్గరకు క్యూ కడుతున్నట్టు సమాచారం. మరికొందరు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. అడ్డదారిలో ఆదాయం ఎక్కువగా వస్తుందని, అందుకే ఈ పోస్టుకు డిమాండ్​ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఎస్ఈలు కూడా నలుగురే.. 

గ్రేటర్ లో ఆరు జోన్లుండగా, ప్రతి జోన్ కు ఒక సీనియర్ ఎంటమాలజిస్ట్(ఎస్ఈ)ని కూడా ఆరోగ్యశాఖనే నియమిస్తుంది. ప్రస్తుతం బల్దియాలో నలుగురు ఎస్ఈలు మాత్రమే ఉన్నారు. నలుగురిలో ఒక ఎస్ఈ రెండు జోన్లను చూస్తుండగా, కూకట్​పల్లి జోన్ లో ఇన్​చార్జిగా బల్దియా ఆఫీసరే కొనసాగుతున్నారు. ఈ ఎస్​ఈల్లో కూడా  కొందరు సీఈ పోస్టుకి అర్హులుగా ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు హెల్త్ మినిస్టర్ దగ్గరకు వెళ్లి పైరవీ చేస్తున్నట్టు సమాచారం. ఇదివరకు గ్రేటర్ లో పని చేసి వెళ్లిన ఓ ఆఫీసర్​కూడా సీఈ పోస్టు కోసం పైరవీ చేస్తున్నట్లు తెలిసింది. 

దోమలు పెరగడంపై మంత్రి ఫైర్

సిటీలో దోమలు పెరిగిపోతుండడంతో జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​బల్దియా ఆఫీసర్లపై ఫైర్​అయినట్టు సమాచారం. దోమలు పెరగకుండా ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో చీఫ్ ఎంటమాలజిస్ట్ ను  నియమించాలని బల్దియా లెటర్లపై లెటర్లు రాస్తోంది. సీఈ లేకపోవడంతో అడిషనల్ కమిషనర్ (హెల్త్ )పై భారం పడుతోంది.