మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన అనుచరుడు రామ్మోహన్‎ అరెస్ట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్ కార్యకర్త  బొల్లి రామ్మోహన్ అరెస్ట్ అయ్యాడు. శనివారం (నవంబర్ 30) తెల్లవారుజూమున రామ్మోహన్‎ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసైన్డ్ ల్యాండ్‎లో అక్రమంగా క్రషర్ నిర్వహిస్తున్నారని కలెక్టరేట్ కార్యాలయంలోని ఈ- సెక్షన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఎమ్మార్వో గుగ్గిళ్ళ వేణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో కంప్లైంట్ మేరకు రామ్మోహన్‎ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. 

న్యాయస్థానం బొల్లి రామ్మోహన్‎కు14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా, సిరిసిల్లలో కేటీఆర్ ప్రధాన అనుచరుడుగా ఉన్న రామ్మోహన్.. ట్రాక్టర్ అసోసియేషన్, ఆటో యునియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక, మాఫియా, ల్యాండ్ కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకున్నట్లు రామ్మోహన్‎పై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.