బెయిల్​ ఇచ్చేందుకు భయమా? : మంగారి రాజేందర్

ముద్దాయిలకు బెయిల్​మంజూరు చేయడంలో కేసులను విచారిస్తున్న కోర్టులు అంటే జిల్లాల్లో ఉండే కోర్టులు ఇష్టపడటం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్​ ఇటీవల బార్​కౌన్సిల్​ఆఫ్​ ఇండియా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ‘‘సామాన్య ప్రజలు మొదటగా కలిసేది, వాళ్లకు అవసరం ఉండేది జిల్లా న్యాయవ్యవస్థతోనే. వాటి వ్యవహార శైలి కూడా చాలా ముఖ్యమైనది. వాటి ప్రభావం హైకోర్టులు, సుప్రీంకోర్టుపైనా ఉంటుంది. బెయిల్స్​మంజూరు చేయడం వల్ల ఇబ్బందులకు గురి అవుతామన్న భయంతో జిల్లా జడ్జిలు బెయిల్స్​ మంజూరు చేయడం లేదు. దాని వల్ల హైకోర్టులు, సుప్రీంకోర్టుపైన పనిభారం పెరుగుతుందని" ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

సబార్డినేట్​ అనే పద బంధం

దేశంలో బలమైన జిల్లా న్యాయవ్యవస్థ ఆవశ్యకత ఉందని, అందు కోసం జిల్లా న్యాయ వ్యవస్థ పట్ల మన దృష్టి కోణం మారాలని కూడా ఆయన అన్నారు. హైకోర్టుల ఆధీనంలో జిల్లా న్యాయ వ్యవస్థ పని చేస్తూ ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని కూడా ప్రస్తావించారు. జిల్లా న్యాయ వ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. నిజానికి న్యాయవ్యవస్థలో అందరూ స్వతంత్రులే. మేజిస్ట్రేట్​ కోర్టులో కూడా ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకునే అవకాశం లేదు. కానీ రాజ్యాంగంలో సబార్డినేట్ జ్యుడీషియరీ అని పేర్కొనడం వల్ల జిల్లా న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తులను సబార్డినేట్స్​గా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పరిగణిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉన్న రక్షణ జిల్లా కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులకు లేదు. అంతేకాదు సబార్డినేట్​జ్యుడీషియరీ, లోయర్​జ్యుడీషియరీ అన్న పదబంధాలు వారి స్థాయిని తగ్గించేస్తున్నాయి.

న్యాయమూర్తుల ధోరణి మారాలి

హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పులు, కామెంట్స్​వల్ల కూడా జిల్లా న్యాయమూర్తులు జంకే పరిస్థితి ఏర్పడింది. బెయిల్​సమస్య ఈ ఒక్క సమస్యతోనే ముడిపడలేదు. బెయిల్​మంజూరు చేయగానే సరిపోదు. బెయిల్​మొత్తం కూడా సహేతుకంగా ఉండాలి. ముద్దాయిలు ఆ మొత్తాన్ని కోర్టుకు ఇచ్చే విధంగా ఉండాలి. ఈ మొత్తాలను కోర్టుకు చూపించలేక ఎంతో మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. దేశంలోని జైళ్లలో ఉన్న వ్యక్తుల్లో 75 శాతం వరకు విచారణ లో ఖైదీలే కావడం గమనార్హం. ప్రధాన న్యాయమూర్తి చెప్పిన ప్రకారం న్యాయాన్ని అందించడం అనేది మానవీయ కోణం. అందుకని జిల్లా న్యాయమూర్తులను విశ్వసించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రధాన న్యాయమూర్తి అన్నట్లు రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తుల ధోరణి మారాలి. జిల్లా న్యాయమూర్తులు హైకోర్టు పరిపాలనా న్యాయపరిధిలో ఉంటారు తప్ప నిజానికి వాళ్లు సబార్డినేట్స్​ న్యాయమూర్తులు కాదు. ఈ విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గుర్తించాలి.

పెరుగుతున్న పిటిషన్ల సంఖ్య

బెయిల్​ మంజూరు చేసినప్పుడు హైకోర్టు విధిస్తున్న  షరతులని చూస్తే అవి న్యాయపరిధిని మించి విధిస్తున్నట్టుగా  అనిపిస్తున్నాయి. అంతే కాదు హైకోర్టు న్యాయమూర్తులు కూడా బెయిల్​దరఖాస్తులను ఎంతకాలంలో పరిష్కరిస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉన్నది. నెలల తరబడి విచారిస్తున్నట్టు సుప్రీం కోర్టే ఓ కేసులో వ్యాఖ్యానించింది. జిల్లా కోర్టుల న్యాయమూర్తులే కాదు హైకోర్టు న్యాయమూర్తులు కూడా బెయిల్​ఇవ్వడానికి సంకోచిస్తున్నట్టు  అనిపిస్తుంది. బెయిలు మంజూరు విషయంలో న్యాయ రక్షణ వున్న న్యాయమూర్తులు జంకాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని న్యాయమూర్తులు ఆలోచించాల్సిన అవసరం వుంది.  బెయిల్​పిటిషన్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. జిల్లా కోర్టుల్లోనే కాదు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ ఇదే పరిస్థితి. అదే విధం గా బెయిల్​సమస్య రోజు రోజుకీ పెరిగిపోతున్నది. బెయిల్​ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది ఆ కేసులోని తీవ్రతను బట్టి, ఆరోపణలను బట్టి ఉంటుంది. ‘బెయిల్​ఇవ్వడం అనేది నియమం. తిరస్కరించడం అనేది మినహాయింపు’ అని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిన ఈ విషయాన్ని జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తులు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బెయిల్​ చట్టం తీసుకురావాలని..

క్రిమినల్​ప్రొసీజర్​ కోడ్​ లోని సెక్షన్​437 ప్రకారం బెయిల్ ను తిరస్కరిస్తున్నప్పుడు న్యాయమూర్తి కారణాలను రాయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగానీ బెయిల్​ను మంజూరు చేస్తున్నప్పుడు కాదు. రెండు సార్లు కారణాలను నమోదు చేయడం చాలా మంది పద్ధతి. ఈ పరిస్థితి ఉన్నప్పటికీ జిల్లా న్యాయవ్యవస్థ బెయిల్స్​ మంజూరు చేసే విషయంలో తడబడుతున్నది. ‘ప్లే సేఫ్’ విధానాన్ని అందరూ పాటిస్తున్నారు. బెయిల్​మంజూరు చేసే విషయంలో జిల్లా న్యాయ వ్యవస్థది ప్రధాన పాత్ర. వారిపైన రకరకాల ఒత్తిడులు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు దేశంలో కొత్త విధానం వచ్చింది. సత్వర న్యాయం కావాలని అంటున్నారు. మహిళలపై నేరం చేశాడన్న ఆరోపణ రాగానే లేక తీవ్రమైన నేరం జరగగానే ఆ వ్యక్తులను చంపివేయాలన్న డిమాండ్​ ప్రజల నుంచి వస్తోది. ఈ ఒత్తిడి మామూలు ప్రజల మీద ఈ నేరాలు జరిగినప్పుడు రాదు. అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను చంపివేయాలన్న డిమాండ్ ​ప్రధాన రాజకీయ నాయకులే చేస్తున్నప్పుడు, న్యాయబద్ధంగా బెయిల్​ ఇవ్వాలని అనుకున్న న్యాయమూర్తి జంకుతాడు. ఈ పరిస్థితిని ప్రధాన న్యాయమూర్తి పరిశీలించడం లేదానన్న సందేహం సహజంగానే వస్తుంది. ‘ఉపా’ లాంటి కేసుల్లో న్యాయమూర్తులు బెయిల్​ ఇవ్వడానికి జంకే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా అలాంటి పరిస్థితినే సృష్టిస్తున్నాయి. ఉపా లాంటి కేసుల్లో ‘రాజ్యం’ చెప్పిన అంశాలనే పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఓ కేసులో అంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా న్యాయమూర్తులు బెయిల్ ను న్యాయబద్ధమైన కేసుల్లో ఇవ్వడానికి కూడా జంకుతారు. ఈ పరిస్థితులను గమనించి సుప్రీంకోర్టులోని మరో బెంచ్ ​బెయిల్​కు సంబంధించి ఓ చట్టాన్ని తీసుకురావాలని సూచించింది.

- మంగారి రాజేందర్,  ​జిల్లా జడ్జి (రిటైర్డ్)