హైదరాబాద్, వెలుగు: పెండింగ్ కేసులు పరిష్కరించేందుకు అడ్వకేట్ల సహకారం ఎంతో అవసరమని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జడ్జి జస్టిస్ సుజయ్‌పాల్ అన్నారు. ఇప్పటికే తీసుకున్న చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయన్నారు. 2024, జనవరి 1వ తేదీ నాటికి హైకోర్టులో 2,31,575 కేసులు పెండింగ్‌లో ఉంటే, డిసెంబర్ 31వ తేదీనాటికి 2,29,221కు తగ్గాయన్నారు. ఏడాదిలో 70,626 కేసులు కొత్తగా నమోదైతే.. 72,980 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. హైకోర్టు ఆవరణలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘జ్యుడీషియరీలో ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం.
జాతీయ లోక్‌అదాలత్ ద్వారా దేశంలోనే అత్యధిక కేసులు తెలంగాణలోనే పరిష్కారం అయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ ప్రారంభించుకున్నాం. హైకోర్టులో 2 డివిజన్ బెంచ్‌లు, ఒక సింగిల్ బెంచ్ పేపర్ లెస్ కోర్టులుగా పని చేస్తున్నాయి. హైకోర్టు సహా రాష్ట్ర వ్యాప్తంగా 97 ఈసేవా కేంద్రాలు నడుస్తున్నాయి. 10 జిల్లా కోర్టుల్లో రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభించాం’’అని జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో సుప్రీం కోర్టు, హైకోర్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
ఫ్రీడమ్ ఫైటర్ వల్లభాయ్ పటేల్.. జూనియర్ అడ్వకేట్‌గా బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కేసుకు సంబంధించిన పత్రాలు లేకుండా కేసు వాదించి చరిత్ర పుటల్లో నిలిచారన్నారు. ఆ కేసు గురించి ఆయన కోర్టులో చెప్పిన విషయాలను అధికారులు రికార్డు చేస్తే 2 వేల పేజీలు అయ్యాయని తెలిపారు. పటేల్‌ను నేటి యువ అడ్వకేట్లు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ రవీందర్ రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహా రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నర్సింహశర్మ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర్ రావు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు పి.విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్నారు.