సీఎం ఆదేశాలతో.. రాష్ట్రాన్ని డ్రగ్స్​ ఫ్రీగా మారుస్తున్నాం

  • ఓరుగల్లులో నాటుసారా కంట్రోల్‍కు ఈ నెల 31 డెడ్‍లైన్‍ 
  • స్టేట్‍ ఎన్‍ఫోర్స్ మెంట్‍ డైరెక్టర్‍ వీబీ.కమలాసన్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు: సీఎం రేవంత్‍రెడ్డి ఆదేశాలతో రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా మారుస్తున్నామని స్టేట్‍ ఎన్‍ఫోర్స్​మెంట్‍ డైరెక్టర్‍ వీబీ.కమలాసన్‍రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఎక్సైజ్‍ ఎన్‍ఫోర్స్​మెంట్‍ జాయింట్‍ కమిషనర్‍ ఖురేషీ, వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ అంబర్‍ కిషోర్‍ ఝా, ఎక్సైజ్‍ డిప్యూటీ కమిషనర్‍ అంజన్‍రావు, అసిస్టెంట్‍ కమిషనర్‍ నాగేందర్​రావుతో కలిసి హనుమకొండ కలెక్టరేట్‍లో మత్తు పదార్ధాలు, గంజాయి నిర్మూలన, గుడుంబా, ఎక్సైజ్‍ పాలసీ తదితర అంశాలపై రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓరుగల్లులో పల్లెలు, తండాలను పట్టిపీడిస్తున్న నాటుసారాపై ఆగస్ట్​ 31 నాటికి లేకుండా ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ విషయంలో గతంలో చూపిన చొరవ అభినందనీయమని చెబుతూనే మరోసారి సీరియస్‍గా తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా నాటుసారాకు ఉపయోగిస్తున్న బెల్లం సరఫరాపై స్పెషల్‍ ఫోకస్‍ పెట్టడంతో పాటు దీన్ని సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్​లు పెట్టడం ద్వారా కోర్ట్​లో జైలు శిక్షలు పడేలా సరైన రీతిలో ఛార్జీషీట్‍ ఫైల్‍ చేయాలన్నారు. సీపీ అంబర్‍ కిషోర్‍ ఝా మాట్లాడుతూ.. వరంగల్‍ జిల్లాను నాటుసారాతో పాటు డ్రగ్స్​ ఫ్రీ జిల్లాలుగా మార్చేందుకు కలిసి పని చేయనున్నట్లు చెప్పారు.