![రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా ఆక్వా రంగం నిలవాలి: CM చంద్రబాబు](https://static.v6velugu.com/uploads/2025/02/chief-minister-chandrababu-participated-in-aqua-tech-20-conclave_8KCZuWiXy4.jpg)
టెక్నాలజీ వాడకంతో అక్వా రంగంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఆక్వారంగం గ్రోత్ ఇంజన్‌గా నిలుస్తుందన్నారు. టెక్నాలజీ వాడకం, నూతన పద్దతులతో ఈ రంగంలో నిలకడగా 30 గ్రోత్‌రేట్ సాధ్యమేనన్నారు. ఆక్వాలో ప్రకృతి సేద్యంతో ప్రపంచ వ్యాప్తంగా మన ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడుతుందని సీఎం వివరించారు. ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయంలో మంచి ఫలితాలు వస్తున్నాయని.. ఆక్వాలో కూడా ఆ తరహా విధానాలు అమలు చేయాలన్నారు. ఆక్వా ఫీడ్ విషయంలో తగు మార్పులు చేయాలని అన్నారు. మన ఉత్పత్తులకు వ్యాల్యూ యాడ్ చెయ్యడం ద్వారా రైతులు ఎక్కువ ఆదాయం పొందవచ్చని సీఎం చెప్పారు.
ప్రస్తుతం 4 లక్షల ఎకరాల్లో ఆక్వాను సాగు చేస్తున్నారని.. 2029-30నాటికి 10 లక్షల ఎకరాలకు పెరగాలని సీఎం ఆకాంక్షించారు. అయితే కాలుష్య రహితంగా ఆక్వా ప్రయాణం సాగాలన్నారు. ఆక్వాలో ప్రధాన సమస్యగా ఉన్న కాలుష్యానికి పరిష్కార మార్గాలు ఉన్నాయని.. వాటిని రైతులు, ఉత్పత్తి దారులు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ సాగు వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని.. అలా కాకుండా ఇష్టానుసారంగా చేస్తానంటే మాత్రం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. ఆక్వాకు ప్రాధాన్యం అనేది తమ అభిమతమన్న సీఎం.. నిబంధనల అమలకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తామని...పొల్యూషన్ విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.
మూడు రోజుల పాటు విజయవాడలోని హోటల్‌లో జరిగిన ఆక్వా టెక్ 2.0 కాన్ క్లేవ్ చివరి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. జిఎఫ్‌ఎస్‌టి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఆక్వారంగంలో వస్తున్న మార్పులు, అవకాశాలు, సమస్యలు, పరిష్కారాలు, పాలసీలు, టెక్నాలజీ సహకారం వంటి అంశాలపై చర్చించారు. రైతులు, ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల యజమానులు, ట్రేడర్లుతో పాటు నిపుణులు ఈ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రానికి ఆక్వాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చేందుకు ఉన్న అవకాశాలు, అధిగమించాల్సిన అవరోధాలపై ఈ సదస్సుల్లో చర్చించారు. రైతులను చైతన్య పరిచేలా.. టెక్నాలజీ వాడకం పెంచేలా మూడు రోజుల పాటు పలు అంశాలపై ఇక్కడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆక్వాసాగుకు రాష్ట్రం అనుకూలం
‘ఆక్వా రంగంపై నాకు ప్రత్యేక మైన శ్రద్ధ ఉంది.. మన రాష్ట్రం ఆక్వా సాగుకు అత్యంత అనుకూలం. 2014-19 మధ్య కాలంలో నాడు ఆక్వా రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. రాష్ట్ర జీవీఎ(స్థూల విలువ జోడింపు)లో 8.8 శాతం ఆక్వా వాటాగా ఉంది. వియత్నాం వంటి దేశాల్లో మన కంటే తక్కువ ప్రొడక్షన్ ఉన్నా.. వాల్యుయేషన్‌లో వాళ్లు ముందు ఉన్నారు. వియత్నాం ఆక్వా ఉత్పత్తుల్లో 3.9 మిలియన్ టన్నుల ఎగుమతులతో 13 బిలియన్ డాటర్లు ఆర్జిస్తుండగా, మనం 5 మిలియన్ మెట్రిక్ టన్నులు ఎగుమతి చేస్తూ 3 బిలియన్ డాలర్లు మాత్రమే ఆర్జిస్తున్నాం. మనం కూడా ఆ దిశగా ప్రయాణం చేయడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయి. మన ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా మంచి ధరలు పొందవచ్చు. దీనికి పరిష్కారం వేస్ట్ టు వెల్త్. దీని ద్వారా సమస్యలు పరిష్కారం చూపవచ్చు’ అని సీఎం అన్నారు
ప్రభుత్వం నుంచి అన్నిరకాల ప్రోత్సాహం
‘1995లో నాడు ఐటీ అన్నాను.. నేడు ఏఐ అంటున్నాను. మనం టెక్నాలజీని స్వాగతించాలి. ఖర్చులు తగ్గించుకునేందుకు, నాణ్యత పెంచేందుకు ఏఎఐను ఆక్వారంగంలోనూ విరివిగా వాడాలి. రొయ్యల రైతులు రకరకాల వైరస్‌ల కారణంగా నష్టపోతుంటారు. వీటి సమాచారాన్ని ఏఐ ద్వారా విశ్లేషించి ఏ జబ్బులు వచ్చే అవకాశం ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. తద్వారా సరైన మందులతో ముందుగానే తగు చర్యలు తీసుకోవచ్చు. ఏఐ అనేది నేను చెపుతుంటే కొందరు అర్థం చేసుకోవడం లేదు. కానీ తప్పదు ఏఐ టూల్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ, అవకాశాలను అందిపుచ్చుకుంటేనే సత్వర ఫలితాలు వస్తాయి. డాటా ఆధారంగా రాబోయే రోగాన్ని ముందే కనిపెట్టి చెప్పవచ్చు. మరోవైపు పంటల ఉత్పత్తితో పాటు.. ప్రాసెసింగ్ ఉంటేనే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీకి భవిష్యత్ ఉంటుంది. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా పోత్సాహం అందిస్తుంది” అని సీఎం అన్నారు.
సాగులో మార్పుతోనే అధిక ఆదాయం
“ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయి. దానికి అనుగుణంగా రైతులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆక్వా, హార్టికల్చర్, పామాయిల్, కోకో పంటల సాగుతో మంచి ఫలితాలు వస్తున్నాయి. దీన్ని రైతాంగం అర్థం చేసుకుని సాగులో మార్పులు చేయాలి. అలాగే డైరీ మీద కూడా ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. సామాన్య ప్రజల ఎకనమిక్ యాక్టివిటీకి పశుసంపద ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాల సర్టిఫికేషన్, ట్రేసబులిటీ అనేది రానున్న రోజుల్లో ప్రాధాన్య అంశంగా మారిపోతుంది. ఏ ఆహారం ఎక్కడ ఉత్పత్తి అయ్యింది.. దాని వివరాలు కూడా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. తద్వారా ఆయా పంటలకు, ప్రకృతి సేద్యం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. రానున్న రోజుల్లో దక్కే అవకాశాలను గుర్తించి దానికి అనుగుణంగా ఇప్పటినుంచే పనిచేస్తే ఫలితాలు వస్తాయి” అని ముఖ్యమంత్రి అన్నారు.