పెద్దపల్లి జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పెద్దపల్లి జిల్లాకు వెళ్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పెద్దపల్లి జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్తున్న సందర్భంగా సీపీఎం, సీపీఐతో పాటు ఇతర వామపక్ష నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటారనే కారణంతో ధర్మారం, జగిత్యాల జిల్లా ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లికి చెందిన బీజేపీ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో రాష్ట్ర బీజేపీ దళిత మోర్చా అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ, యాళ్ల తిరుపతి రెడ్డితో పాటు ఇతర నాయకులు కూడా ఉన్నారు. ఇటు మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలాల్లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులతో పాటు వీఆర్ఏలను అరెస్ట్ చేశారు.
మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరణ
పెద్దపల్లి కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. అయితే.. మీడియా ప్రతినిధులకు అనుమతి లేదని పోలీసులు, అధికారులు చెబుతున్నారు. కేవలం బహిరంగ సభకు మాత్రమే మీడియా ప్రతినిధులకు పాసులు జారీ చేశారని తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ టూర్ షెడ్యూల్
ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన ప్రగతిభవన్ నుండి సీఎం కేసీఆర్ బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఎమ్మెల్యే ఇంట్లో సీఎం కేసీఆర్ భోజనం చేసిన అనంతరం అక్కడి నుండి గౌరెడ్డిపేటలో టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకొని 2:40 గంటలకు నూతనంగా నిర్మించిన తెలంగాణ భవన్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి 3:10 నిమిషాలకు పెద్దకల్వలలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనానికి చేరుకుంటారు. జిల్లా సమీకృత భవనాల ప్రారంభోత్సవం అనంతరం 3:40 నిమిషాలకు బయలుదేరి 3:45 నిమిషాలకు పెద్దకల్వలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తర్వాత పెద్దపెల్లి జిల్లా ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించిన అనంతరం రోడ్డు మార్గాన సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 8 గంటలకు హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకుంటారు.