వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు హెలికాఫ్టర్ లో చేరుకున్నారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం రావినూతల పంట పొలాల్లో దిగి పంట నష్టం గురించి అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఉన్నారు.
రామాపురం గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. గార్లపాడులో నష్టపోయిన రైతులతో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. జిల్లా కలెక్టర్ ఎంపిక చేసిన వారితో మాట్లాడనున్నారు. అంతకుముందు.. నష్ట పోయిన మొక్కజొన్న పంటల ఫోటో గ్యాలరీని పరిశీలించారు.
ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుని దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. రెడ్డికుంట తండా నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం వెల్లి అక్కడి పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బ తిన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.