8 నూతన మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభించారు. ప్రగతిభవన్ నుంచి నిర్వహించిన కార్యక్రమం ద్వారా నూతన వైద్య కళాశాలల్లో ఏకకాలంలో తరగతులను వర్చువల్ గా ప్రారంభించారు. కొత్త మెడికల్​ కాలేజీలు రావడానికి రాష్ట్ర వైద్యశాఖ చాలా కృషి చేసిందని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావాలని రాష్ట్ర ప్రభుత్వం  సంకల్పించిందని, అందులో భాగంగానే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో కొత్తగా 1150 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. గతంలో 850 సీట్లు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు 2,790 సీట్లు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. 

‘తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇవాళ సువర్ణధ్యాయం. మర్చిపోలేని రోజు. ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడం గర్వకారణం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మరో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, అందుకోసం రాష్ట్ర వైద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో చాలామంది విద్యార్థులకు అవకాశాలు రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో కంటే మెడికల్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లను గణనీయంగా పెంచామన్నారు. సీట్ల పెరుగుదలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు అపారమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

నూతన మెడికల్ కాలేజీలను తరచూ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తోపాటు ఆ శాఖ అధికారులు కూడా సందర్శించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నూతన మెడికల్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని, ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు అభివృద్ది చెందాలన్నారు. పలు జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న నూతన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కోరారు. 

అందుబాటులో 8 మెడికల్ కాలేజీలు

సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌ కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు. 8 కాలేజీలతో అదనంగా 1,150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు