![స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యం.. సీఎల్పీ దిశానిర్ధేశం](https://static.v6velugu.com/uploads/2025/02/chief-minister-revanth-reddy-directed-congress-mlas-to-work-in-coordination-with-aim-of-winning-local-body-elections-in-telangana1_9pBz1fn46h.jpg)
- = కొత్త, పాత నేతలు సమన్వయంతో సాగండి
- = స్థానిక సంస్థల్లో పాగా వేయడమే టార్గెట్
- = కులగణనపై ఉత్తర తెలంగాణలో భారీ సభ
- = ఎస్సీ వర్గీకరణపై ఉమ్మడి నల్లగొండలో పబ్లిక్ మీటింగ్
- = మన మధ్య బేధాభిప్రాయాలను పక్కపెడుదాం
- = సమస్యలుంటే తనతో ఎప్పుడైనా చెప్పొచ్చన్న సీఎం
- = ఎంసీహెచ్ఆర్డీ లో సీఎల్పీ మీటింగ్
- = ఎమ్మెల్యేలకు సీఎం, దీపాదాస్ దిశానిర్దేశం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొత్త, పాత నేతలు సమన్వయంతో సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
నియోజకవర్గాల్లో కొత్త పాత నేతలు సమన్వయంతో సాగితేనే స్థానిక సంస్థల్లో పాగా వేయగలమని సూచించారు. కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా బీసీ కులగణన చేపట్టామని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతా చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేద్దామని సూచించారు.
బీసీ కులగణను శాస్త్రీయంగా చేపట్టామని, దీనిపై ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాల స్థాయిలోనే కౌంటర్ అటాక్ చేయాలని సూచించారు. అదే విధంగా ఎస్సీ వర్గకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, చెప్పామని, దానిని అమలు చేసి చూపామని అన్నారు.
ALSO READ | సీఎల్పీ సమావేశానికి డాక్యుమెంట్లతో వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి!
ఎస్సీ వర్గీకరణను వివరించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ మేరకు సమావేశంలో నిర్ణయించారని సమాచారం. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ జరిగింది.
ఎమ్మెల్యేలు ఏమైనా సమస్యలుంటే తన వద్దకు వచ్చి నేరుగా చెప్పుకోవచ్చని సీఎం చెప్పారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై ప్రతిపక్షాలు లేని పోని అపోహలు సృష్టిస్తున్నాయని, అదే స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇవ్వాలని సూచించినట్టు సమాచారం.
ఆ 10 మంది దూరం
ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, సంజయ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరు కాలేదు. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడం, కేసు సుప్రీంకోర్టులో ఉండటం.. టెక్నికల్ గా ఏ సమస్యా రాకుండా ముందు జాగ్రత్త చర్యలగా వీరు గైర్హాజరైనట్టు సమాచారం.