ఫ్రీ బస్ అడ్డుకునేటోళ్లకు సలాక కాల్చి వాతపెట్టుండ్రి: సీఎం రేవంత్రెడ్డి

ఫ్రీ బస్ అడ్డుకునేటోళ్లకు సలాక కాల్చి వాతపెట్టుండ్రి: సీఎం రేవంత్రెడ్డి
  • మహిళా సంఘాలకే స్కూలు పిల్లల యూనిఫాంలు కుట్టే బాధ్యత
  • త్వరలో రూ.500 కే సిలిండర్
  • ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభిస్తం
  • 200  యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేస్తం
  • నాగోబాకు ప్రత్యేక పూజలు చేసిన సీఎం
  • ప్రత్యేక దర్బార్లో మహిళా సంఘాలతో మీటింగ్

ఆదిలాబాద్: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అడ్డుకుంటున్న వారికి సలాక కాల్చి వాత పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాసేపటి క్రితం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్బార్ లో ఆయన మాట్లాడారు.

గోండు మహిళల చైతన్యాన్ని చూసి అబ్బురపడ్డారు. కుట్టుపనిలో రాణిస్తున్న మహిళలను అభినందించారు. గురుకులాలు, హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థుల యూనిఫారాలు కుట్టే పనిని ఇకపై మహిళా సంఘాలకే అందిస్తామని చెప్పారు. ఇందుకోసం వారికి కుట్టు మిషన్లు కూడా సమకూర్చుతామని అన్నారు. గతంలో దీపం పథకం కింద రూ. 400కే గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.

త్వరలోనే రూ. 500కే సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తామని, ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా లక్ష మంది మహిళల సమక్షంలో పథకాన్ని ప్రారంభించుకుందామని వివరించారు. నిరుపేదలకు లబ్ధి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. త్వరలోనే 200 యూనిట్లలోపు ఇండ్లకు ఉచితంగా కరెంటు అందిస్తామని చెప్పారు.

ఆడబిడ్డ బాగుంటేనే..

ఆడబిడ్డ బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, అందుకే మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రులు దివంగత వైఎస్సార్ పావలా వడ్డీకే మహిళలకు రుణాలు అందించారని, ఆ తర్వాత కిరణ్​ కుమార్ రెడ్డి ప్రభుత్వం సున్నా వడ్డీ కే రుణాలు అందించి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని సీఎం గుర్తు చేశారు. 

మాట నిలబెట్టుకుంటున్నం

కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటుందని ఎన్నికలకు ముందు చెప్పామని, అందులో భాగంగానే తొలి మీటింగ్ ఇక్కడే ఏర్పాటు చేశామని రేవంత్  రెడ్డి చెప్పారు. ఇక్కడి నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇవాళ 7 కోట్ల రూపాయలతో నాగోబా ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని చెప్పారు.

మహిళా సంఘాలకు రూ. 60 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించినట్టు సీఎం చెప్పారు. దర్బార్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జు, పీ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.