- హాజరైన సీఎం రేవంత్, మంత్రులు..వేలాదిగా తరలివచ్చిన జనం
- ఆకట్టుకున్న ఎయిర్ షో,రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్ షో
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, పరిసర ప్రాంతాల్లో సంబురంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఎయిర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వీటిని తిలకించేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు. ట్యాంక్‌బండ్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏరోబాటిక్ విన్యాసాలు ప్రదర్శించారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ లీడర్ కెప్టెన్ అజయ్ దాశరథి నాయకత్వంలో 9 ఎయిర్క్రాఫ్ట్స్ఆకాశంలో విన్యాసాలు చేశాయి. ఇవి సాయంత్రం 4:15 గంటల నుంచి 4:45 గంటల వరకు దాదాపు అరగంట కొనసాగాయి.
ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్మార్గ్.. ఇలా ట్యాంక్బండ్చుట్టూ వేలాది మంది జనం చేరి విన్యాసాలను తిలకించారు. విన్యాసాల ముగింపు సందర్భంగా కెప్టెన్ అజయ్ దాశరథి ఆకాశం నుంచి ‘‘ధన్యవాదాలు హైదరాబాద్! మీ ప్రేమకు షుక్రియా’’ అంటూ సందేశం ఇచ్చారు. ఈ ఎయిర్ షోను ట్యాంక్ బండ్ పైనుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు వీక్షించారు.
కల్చరల్.. ఫుల్ జోష్
వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సెక్రటేరియెట్ ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం ఉన్న సర్కిల్ వరకు మొత్తం మూడు స్టేజీలు ఏర్పాటు చేసి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. బోనాల కోలాటం, మోహినీఆట్టం, భరతనాట్యం, పేరిణి నృత్యం, చిందు యక్షగానం, మిమిక్రీ, థియేటర్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఇక సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన పాడిన పాటలు యూత్ లో జోష్ నింపాయి. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఈ షో తనకు లైఫ్‌లో లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను స్థాయికి రావడానికి ఎదుర్కొన్న ఒడిదొడుకులను పంచుకున్నారు. ఈ టైమ్ లో సీఎం రేవంత్ రెడ్డిని స్టేజ్ మీదకి ఆహ్వానించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
నోరూరించిన ఫుడ్ స్టాల్స్..
ట్యాంక్ బండ్ పై తెలంగాణ వంటకాలతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఫిషరీస్కార్పొరేషన్, మెప్మా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్, హ్యాండీక్రాఫ్ట్స్ స్టాల్స్ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్, మంత్రులు స్టాల్స్ అన్నీ తిరుగుతూ పరిశీలించారు. కాగా, వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అందరూ కూర్చునేందుకు వీలుగా టెంట్, చైర్లు వేశారు.