- ఎవరు ఏ మతాన్నిఆచరించినా రక్షణ కల్పిస్తం
- ఎల్బీ స్టేడియం క్రిస్మస్ వేడుకల్లోసీఎం రేవంత్ రెడ్డి
- దళిత క్రిస్టియన్ల అభివృద్ధికి కృషిచేస్తున్నంసంక్షేమ పథకాల్లో వారికి
- ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి
బషీర్ బాగ్, వెలుగు: అన్ని మతాలనూ ప్రజా ప్రభుత్వం సమానంగా చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే క్రిస్మస్ ను అతిపెద్ద పండుగగా జరుపుకుంటారని పేర్కొన్నారు. ‘‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే.. పొరుగువారిని కూడా ప్రేమించాలని ఏసుప్రభు బోధించారు” అని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ క్రిస్టియన్ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎంకు క్రిస్టియన్ సంఘాలు ఘనస్వాగతం పలికాయి.
సీఎంతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, పలు శాఖల ముఖ్య అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలతో పోటీపడుతూ క్రైస్తవ సంఘాలు విద్య, వైద్యంను పేదలకు అందిస్తున్నామని కొనియాడారు.
ఏ సమాజమైనా ఆర్థిక పురోగతి సాధించాలంటే విద్య పాత్ర ముఖ్యమైందని, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ సొసైటీలు అందిస్తున్నాయన్నారు. విద్యార్థులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయని పేర్కొన్నారు.
మారుమూల గ్రామాల్లోనూ వైద్యసేవలు అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎవరు ఏ మతాన్ని విశ్వసించినా, ఆచరించినా, ప్రచారం చేసినా వారికి ప్రజాప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. మరో మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భంగా పలువురు బోధకుల ఆశీర్వాదం తీసుకున్నానని, వారి ఆశీర్వాదం వల్లే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో చారిత్రాత్మక చర్చిల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
దళిత క్రిస్టియన్ల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. ఇక సంక్రాంతి తరువాత ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని, ఆ పథకాల్లో దళిత క్రిస్టియన్లకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. పార్టీ పదవుల్లో క్రిస్టియన్లకు సముచిత స్థానం కల్పించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కు సీఎం సూచించారు. అనంతరం క్రిస్టియన్లకు డిన్నర్ ఏర్పాటు చేశారు.