పాలమూరు వలసలు ఆపాలని ప్రయత్నిస్తుంటే.. వాళ్లు అడ్డుపడుతున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

పాలమూరు వలసలు ఆపాలని ప్రయత్నిస్తుంటే.. వాళ్లు అడ్డుపడుతున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. కురుమూర్తి స్వామిని దర్శించుకొని.. కొండకు వెళ్లే ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహా, జిల్లా కాంగ్రెస్ నేతలు కురుమూర్తి వెంకన్న స్వామి పూజల్లో పాల్గొన్నారు. పదేళ్లు ఏ అభివృద్ధి చేయకపోవడంతో ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా వలసలకు కేరాఫ్ అడ్రస్ అని.. వలసలు ఆపాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాని ఆనుకొని కృష్ణానది వెళ్తున్నా.. మహబూబ్ నగర్ లో కరువు తాండవిస్తోందన్నారు.   

పాలమూరు జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. కురుమూర్తి, మన్నెంకొండ జాతరలను ఇంకా ఘనంగా నిర్వహింస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు కేసీఆర్ కు ఓట్లు వేసి.. పార్లమెంట్ కు పంపిన కృతజ్ఞతను కేసీఆర్ మర్చిపోవద్దని ఆయన చెప్పుకొచ్చారు. పాలమూరు జిల్లా అండగా నిలబడితేనే కేసీఆర్ 2సార్లు ముఖ్యమంత్రి అయ్యారని రేవంత్ రెడ్డి అన్నారు. అయినా.. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సీఎంగా పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. కురుమూర్తి స్తామి ఆశీర్వాదంతోనే ఆయన ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. కురుమూర్తి దేవాలయానికి రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. పామూరు జిల్లా ప్రజలకు కురుమూర్తి బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తిరుపతి వెళ్లలేని వాళ్లకు.. పేదల తిరుపతిగా కురుమూర్తి వెంకన్న స్వామి కరుణిష్తాడని భక్తులకు నమ్ముతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

పాలమూరు జిల్లా ప్రజల చెమటతోనే ఎన్నో ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. ఈ జిల్లా ప్రజల ఆశీర్వాదంలోనే పార్లమెంట్ కు వెళ్లానని ఆయన గుర్తు చేసుకున్నారు. కృష్ణమ్మ జలాలతో పాలమూరును సస్యశ్యామలం చేస్తానని రేవంత్ రెడ్డి హామి ఇచ్చాడు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులిస్తుంటే.. కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు సీఎం. ఇంకో రకంగా రాజకీయంగా విమర్శలు చేయండి. కానీ.. అభివృద్ధికి అడ్డు పడొద్దని రేవంత్ రెడ్డి సూచించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు అడ్డుపడితే ఎవ్వర్ని క్షమించవద్దని సీఎం రేవంత్ రెడ్డి యువతకు సూచించారు.