అదిరేలా ఆవిర్భావం .. రాష్ట్ర లోగోకు తుదిరూపు

హైదరాబాద్:  తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవాల సందర్బంగా రాష్ట్రం లోగోను, రాష్ట్ర గీతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజామాబాద్ కు చెందిన రుద్ర రాజేశం రాష్ట్ర అధికారిక లోగోను సిద్ధం చేస్తున్నారు. ఇవాళ లోగోకు తుదిరూపు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు కళాకారుడు రాజేశం మంత్రి  జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు సీఎంతో సమావేశమై లోగో తుదిరూపుపై చర్చించారు.

 పోరాటాలు, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపు దిద్దుకున్నట్టు సమాచారం.  అందె శ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కీరవాణి సంగీత దర్శకత్వంలో ఈ గీతం సిద్ధమవుతోంది. దీనిని ఈ రెండింటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2న పరేడ్ గ్రౌండ్ లో జరిగే అధికారిక కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఉత్సవాలకు దాదాపు 20వేల మందికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు.  సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల క్యాంపుల ఏర్పాటు కూడా చేస్తున్నారు. తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్ లు, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేశారు.

Also read :చెన్నూరుకు ధాన్యం స్టోరేజ్ కేంద్రం తెస్త : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

సాయంత్రం చలో ట్యాంక్ బండ్

జూన్ 2 న  సాయంత్రం ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణ సంచా  లేజర్ షోలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉత్సవాలకు  హాజరయ్యే వారి కోసం  ఫుడ్, గేమింగ్ స్టాళ్ళను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు.  రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం 'జయ జయహే తెలంగాణ' పై జాతీయ జెండాలతో మార్చ్-ఫాస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.