దావోస్​ను ఆకట్టుకున్న తెలంగాణ రైజింగ్

దావోస్​ను ఆకట్టుకున్న  తెలంగాణ రైజింగ్

జనవరి 17న సింగపూర్​లో మొదలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఆద్యంతం తెలంగాణ ప్రగతికోసం కొనసాగింది.  ఓ వైపు పెట్టుబడులు, మరోవైపు ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఉద్యోగాలకు తెలంగాణ యువతను అత్యంత స్కిల్డ్ మానవ వనరులుగా తయారు చేయడం వంటి అంశాలను చేపట్టి పనిచేశారు మన సీఎం రేవంత్ రెడ్డి.  

తొలుత సింగపూర్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్ యూనివర్సిటీ మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు.  దీనిద్వారా మన దగ్గర ట్రైనింగ్ పొందుతున్న వేలాదిమంది యువతకు నాణ్యమైన విద్య లభిస్తుంది. 

అనంతరం ఎస్టీ టెలిమీడియా ఏర్పాటు చేయబోయే గ్లోబల్ డేటా సెంటర్ కోసం ఒప్పందం చేసుకున్నారు. వీటి ద్వారా నూతనంగా డెవలప్ చేయబోయే ఫోర్త్ సిటీలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు వస్తాయి. తద్వారా మన యువతకు వేలాది సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. మరుసటిరోజు ముఖ్యమంత్రితో కూడిన ‘తెలంగాణ రైజింగ్’ బృందం సింగపూర్ రియల్ ఎస్టేట్ దిగ్గజం క్యాపిటల్​ ల్యాండ్​తో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. 

ఆ సంస్థ మన దగ్గర ఐటీ పార్క్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. రూ. 450 కోట్లతో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్ నిర్మాణం చేపడతామని, అందులో చాలామందికి ఉపాధి అవకాశాలుంటాయని తెలిపింది.  ఇలా ఈ మూడు రోజుల సింగపూర్ పర్యటనలో ఆశించిన పలితాలు సాధించింది కాంగ్రెస్​  ప్రభుత్వం. ఇవే కాకుండా మూసీ,  ఫోర్త్ సిటీ,  ఫార్మా,  హైడ్రో ప్రాజెక్టుల్లో సహకారానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకువచ్చింది.

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

ఆసియా ప్రాంతం నుంచి యూరప్ ప్రాంతానికి పయనమైన సీఎం బృందం అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూనే వెనువెంటనే పనిలోకి దిగిపోయింది. దావోస్​లో అడుగుపెట్టగానే మన పక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అవడమే కాకుండా మన రాష్ట్రాబివృద్ధి కోసం ప్రముఖులతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి.  

మరుసటి రోజు కన్జ్యూమర్ గూడ్స్ రంగంలో తొలి స్థానాల్లో ఉన్న యూనిలివర్ కంపెనీతో చర్చలు జరిపి హైదరాబాద్ మాత్రమే కాకుండా,  టైర్ 3 సిటీలుగా నిలిచే కామారెడ్డిలో అతిపెద్ద పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్, మరోచోట బ్యాటిల్ క్యాప్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందుకువచ్చేలా కృషి చేశారు.  దీంతో సైతం వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  

ఇక ప్రైవేట్ స్పేస్​ ఇండస్ట్రీని మరింత విస్తరించడం కోసం సైతం పెట్టుబడుల్ని సాధించారు. అంతరిక్ష పురోగతి యావత్​ దేశానికి సంబంధించింది. కానీ, ప్రతి రాష్ట్రం తనకంటూ ఓ సొంత ఉత్పత్తుల్ని సాధించాలనే లక్ష్యంతో స్కైరూట్ కంపెనీతో  రేవంత్​ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా ప్రైవేట్ రాకెట్ల తయారీ, వాటి అనుసంధానం వంటి అంశాల్లో దాదాపు రూ.500 కోట్లను ఆ కంపెనీ పెట్టుబడిగా పెట్టబోతుంది. 

 ఇక 2160 మెగావాట్ల సామర్థ్యం కోసం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును చేపడతామని ముందుకువచ్చిన మేఘా కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకుంది మన తెలంగాణ ప్రభుత్వం, బ్యాటరీ ఎనర్జీ సిస్టం, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ రిసార్ట్ తదితర నిర్మాణాల ద్వారా మొత్తంగా ఈ ఏడాదిలో రూ.15వేల కోట్లను మేఘా కంపెనీ పెట్టుబడి పెట్టబోతుంది. తద్వారా దాదాపు 5వేలకు పైగా ఉద్యోగాలు మన యువతకు వస్తాయి. 

వేలాది ఉద్యోగాలకు అవకాశం

దావోస్ పర్యటన మూడో రోజు ఏకంగా తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా ఏకమొత్తంలో రూ.45,500 కోట్ల పెట్టుబడుల్ని సాధించింది సీఎం సారథ్యంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం, గత సంవత్సరం మొత్తంగా రూ.40వేల కోట్లకు పైగా పెట్టుబడుల్ని తెస్తే ఈ దఫా సన్ పెట్రో కెమికల్స్ తో  ఇంధనరంగంలో అత్యంత భారీ పెట్టుబడుల్ని సాధించింది.

పంప్డ్ స్టోరేజీ రంగంలో హైడ్రో, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లను తెలంగాణ మూడు దిశలా విస్తరించేలా మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు పెరిగేలా నాగర్ కర్నూల్,  మంచిర్యాల, ములుగు వంటి గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు వచ్చేలా చేసిన ఘనత మన కాంగ్రెస్​ ప్రభుత్వానిదే.  దీంతో నిర్మాణ దశలోనే 7వేల ఉద్యోగాలు వస్తాయి, కంట్రోల్ ఎస్ డటా సెంటర్ సైతం  రూ.10వేల కోట్లతో 400 మెగావాట్ల డాటా సెంటర్ ఏర్పాటు చేసి 5వేల మందికి ఉపాధి ఇవ్వబోతుంది.  

ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు

మన హైటెక్ సిటీలో సైతం హెచ్సీఎల్ కంపెనీ 3.2లక్షల చదరపు అడుగులతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది.  దీంట్లో మరో ఐదువేల మంది ఉపాధి పొందుతారు. దీంతోపాటు అన్ మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, డ్రోన్, పైలట్ రహిత ఎయిర్ క్రాప్ట్ తదితర రంగాల్లో పనిచేస్తున్న జేఎస్ డబ్య్లూ వంటి అమెరికా సంస్థల్ని సైతం తెలంగాణకు తెప్పించి పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.  వారితో రూ.800 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడమే కాకుండా రక్షణ ఉత్పత్తులతో తెలంగాణ రాణించబోతున్నది. 

గేమ్ ​చేంజర్​ సీఎం

సుమారు 50 వేల ఉద్యోగ కల్పనతో నభూతో నభవిష్యత్ అన్న చందంగా దావోస్ ఆర్థిక విశ్వ వేదికను సీఎం రేవంతన్న మాదిరిగా మరే ప్రభుత్వం, మరే సంస్థ ఉపయోగించుకోలేకపోయిందనేది వాస్తవం. ఇదే కదా మన తెలంగాణ ఆశించింది.

ముందుచూపు ఉన్న నాయకుని లక్షణం ఇదే.  దావోస్ వేదికగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించి తెలంగాణ అభివృద్ధికి భారీ పెట్టుబడులు సాధించడం ద్వారా దార్శనికత ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని రుజువు అయ్యింది.  నిజమైన తెలంగాణ కల సహకారం కానున్నది. అందుకే తెలంగాణ రాష్ట్ర  గేమ్ చేంజర్  సీఎం రేవంత్  అని చెప్పవచ్చు.

రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు

పర్యటనలో చివరి రోజైన గురువారం సైతం క్షణం తీరికలేకుండా బిజీ బిజీగా గడిపింది సీఎం రేవంత్ సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ బృందం. రూ. 60వేల కోట్ల విలువైన పెట్టుబడులతో... ఇప్పటికే మూడు సెంటర్లను హైదరాబాద్​లో  నిర్వహిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ మరింత విస్తరించడానికి మన ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 

దీంతో పాటు విప్రో సంస్థ విస్తరణకు ఒప్పించింది. ఇలా భవిష్యత్ చోదకాలైన ఇంధన, టెక్ రంగాల్లో విస్తారమైన పెట్టుబడులతో తెలంగాణను ప్రపంచ గమ్యస్థానంగా మార్చింది. ఫినిక్స్, బ్లాక్ స్టోన్, అక్షిత గ్రీన్ టెక్, ఎక్లోట్ హెల్త్ సొల్యూషన్స్, విప్రో, హెచ్సీఎల్,  టి ల్ మాన్  గ్లోబల్ హోల్డింగ్స్,  రామ్ కీ గ్రూప్,  ఉర్సా క్లస్టర్ లాంటి 20 ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి మొత్తంగా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడుల్ని సాధించింది. 

 

- పున్నా కైలాస్ నేత,టీపీసీసీ జనరల్ సెక్రటరీ