హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం డీజీపీ జితేందర్ ఇతర శాఖల అధికారులతో కలిసి గోల్కొండ కోటలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులు, వేడుకలకు వచ్చే ప్రముఖుల కోసం ఏర్పాటు చేసే గ్యాలరీల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
వేడుకలప్పుడు విద్యుత్ సరఫరా, తాగునీరు, మెడికల్ స్టాల్, వాటర్ ప్రూఫ్ శామియానాలు, సౌండ్ ప్రూఫ్ జనరేటర్లు అందుబాటులో ఉంచాలని, వేడుకల్లో ప్రోటోకాల్ తప్పక పాటించాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించాలని పోలీస్ శాఖను సీఎస్ ఆదేశించారు. సాంస్కృతి, వారసత్వం ప్రతిబింబించేలా వివిధ కళారూపాలకు చెందిన వెయ్యి మందికిపైగా కళాకారులు వేడుకల్లో పాల్గొంటారని సీఎస్ తెలిపారు.