Champions Trophy 2025: జట్టులో 15 మందికే చోటివ్వగలం.. వంద మందికి కాదు: చీఫ్ సెలెక్టర్ అగార్కర్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ శనివారం(జనవరి 18) భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో దారుణంగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్‌లకు చోటు కల్పించిన సెలెక్టర్లు.. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఓ క్రికెటర్‌ను అసలు పట్టించుకోనే లేదు. ఇదే విమర్శలకు తావిస్తోంది.

ఏడు ఇన్నింగ్స్‌లలో 752 పరుగులు

7 ఇన్నింగ్స్‌లలో 752 పరుగులు.. బ్యాటింగ్‌ యావరేజ్‌ 752. వామ్మో... ఇలా కూడా ఆడొచ్చా అన్న రీతిలో భారత క్రికెటర్, విదర్భ కెప్టెన్ కరుణ్‌ నాయర్‌ ప్రదర్శన సాగుతోంది. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఈ టాలెంటెడ్‌ బ్యాటర్ దుమ్మురేపుతున్నాడు. అటు కెప్టెన్‌గా జట్టును నడిపించడంలోనూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతూ సెలక్టర్లకు సవాల్‌ విసురుతున్నాడు.  ఔటవ్వడం అంటే.. అది సెంచరీ కొట్టాకే అన్నట్లుగా ఆడుతున్నాడు. 

1128, 44*, 163*, 111*, 112, 122*, 88*.. ఇవీ గత ఏడు ఇన్నింగ్స్‌లలో అతడు చేసిన స్కోర్లివి. చివరి ఏడు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థి బౌలర్లు అతన్ని అవుట్ చేయగలిగారంటే.. తిరిగి జట్టులో చోటు సంపాదించాలనే అతని కసిని అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ, సెలెక్టర్లు అతన్ని విస్మరించారు. దీనిపై విమర్శలొస్తుండటంతో భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు.

జట్టులో 15 మందికే చోటివ్వగలం..

జట్టులో 15 మందికే చోటివ్వగలం అన్న ఒక్క మాటతో వస్తున్న విమర్శలకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఒకవేళ జట్టులో 100 మందికి చోటిచ్చే అవకాశమే ఉంటే.. అతను తప్పక ఉండేవాడు అన్నట్లుగా మాట్లాడారు. దేశవాళీ క్రికెట్‌లో వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమైనప్పటికీ, జట్టు కూర్పు సమతూకంగా ఉండాలని అన్నారు.    

ALSO READ | పాపం తెలుగోళ్లు.. ముగ్గురిలో ఒక్కరికీ ఛాన్స్ దక్కలే: సిరాజ్, నితీష్, తిలక్ వర్మలకు తీవ్ర నిరాశ

"752 బ్యాటింగ్‌ యావరేజ్‌ అనేది నమ్మశక్యం కానీ విషయం. కానీ, జట్టులో 15 మందికే చోటివ్వగలం.. కాబట్టి అందరిని సంతృప్తి పరచలేం. ఆటగాళ్ల గత అంతర్జాతీయ అనుభవం, వారి ప్రదర్శన సామర్థ్యంతో సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని జట్టును ఎంపిక చేశాం.." అని అగార్కర్ వివరణ ఇచ్చారు.

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.