రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ను కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ఇవ్వడంతో చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేశ్వరం టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డారు. కానీ.. టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె భేటీ అవుతున్నారు. చివరి వరకు లిస్టులో తన పేరే కొనసాగిందని.. కొంతమంది కుట్రతో తన పేరును తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.
తనకు టికెట్ రాకుండా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొంతమందితో రాయబారం నడిపారని చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి ఆరోపించారు. తాను చనిపోయే వరకూ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఫామ్ వచ్చేవరకు వేచి చూస్తానని, కాంగ్రెస్ బీఫాం మీదనే పోటీ చేస్తానని అన్నారు. చివరి నిమిషంలో అయినా తనకే మహేశ్వరం టికెట్ ఇస్తారనే ధీమాతో ఉన్నామన్నారు. తనకు కాంగ్రెస్ అధిష్టానం న్యాయం చేస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ కష్టపడి రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.