మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామంలో స్వచ్చందంగా బెల్టుషాపులు మూసివేయాలని ఏకగ్రీవంగా గ్రామస్థులు తీర్మానం చేశారు. గ్రామాల్లో బెల్టుషాపుల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని మహిళల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బెల్టుషాపుల నియంత్రణపై ప్రభుత్వ నిర్ణయానికి ముందే కృషి చేసిన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. గ్రామంలో బెల్ట్ షాపులు స్వచ్ఛందగా నిలిపివేతపై హర్షం వ్యక్తం చేస్తూ మహిళల ర్యాలీ తీశారు.
తన నియోజకవర్గంలో బెల్టుషాపులన్నింటినీ వారం రోజుల్లో మూసేయాలని కొన్ని రోజుల క్రితం ఎక్సైజ్ ఆఫీసర్లకు హుకుం జారీ చేశారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బెల్టుషాపులు మూసేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సర్కారు ఇంకా విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా రాజగోపాల్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి చౌటుప్పుల్నుంచి నాంపల్లి మండలం వరకు ఎక్కడా ఒక్క బెల్టుషాపు కూడా కనిపించడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు.
బెల్టుషాపుల వల్ల జనం మద్యానికి బానిసై అనేక కుటుంబాలకు వీధిన పడుతున్నాయని, మహిళల బతుకులు ఆగమవుతున్నాయని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తన నియోజకవర్గంలో బెల్టుషాపుల జాడ లేకుండా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.